Tuesday, July 12, 2016

తెలుగు - ఆంగ్ల భాషల సంబంధం: ప్రభావాలు-పర్యవసానాలు


1.0 నేపథ్యం
2.0  ప్రాచీన భారతంలో భాషా స్థితి                   
3.0 వలస భారతంలో భారతీయ భాషలూ- ఇంగ్లీషు
4.0 స్వాతంత్ర్య  భారతంలో ఇంగ్లీష్
5.0 భారతీయ భాషలూ- ఇంగ్లీషూ: స్థితి- పరిస్థితి: సాహిత్య,  విద్యారంగాలు
6.0 ప్రస్తుత భాషాసంక్షోభం: కీలకాంశం-ప్రపంచీకరణ
7.0 మాతృభాషామాధ్యమం ఆంగ్లభాషాప్రభావం
8.0 భారతీయ భాషలూ  తరిగిపోతున్న వ్యవహార రంగాలు
9.0  విద్యామాధ్యమం: మాతృభాషలూ ఆంగ్లభాష
10.0 కమ్ముకొస్తున్న ఆంగ్ల మేఘాలూ-ముంచుకొస్తున్న ముప్పు
11.0 ఉపసంహారం

1.0     నేపథ్యం:
కొన్ని నెలలకిందట ప్రస్తుత గ్రంథ సంపాదకుడు నాకు ఫోన్ చేసి దక్షిణ భారత భాషలకూ ప్రత్యేకంగా తెలుగుకూ ఇంగ్లీషుభాషకూ మధ్యగల సంబంధాలపై ఒక వ్యాసం రాయమని అడిగారు. నేను కొంచెం  అనాలోచితంగానే సరే అన్నాను. ఆ తరువాత ఆయనే నాకు ఈ మెయిల్లో ఒక కాన్సెప్ట్ నోటునుకూడా పంపారు. ఈ వ్యాసం ఎలా ఉండాలో, దేనిగురించి చెప్పాలో టూకీగా ఓ పది అంశాలు  ఇంగ్లీషులో పంపారు. వీటికి నేను వీలైనంత తక్కువ మార్పులు చేసి విషయ స్పష్టతకోసం కొంత తగ్గించి పైన పేర్కొన్న జాబితాను అంశాలవారీగా తయారు చేశాను.

ప్రవహించే నదికి నిలకడ ఉండదు. ఎన్నింటినో తనలో కలుపుకుంటూ, తాను ఎన్నింటిలోనో కలుస్తూ ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది.   భాషకూడా అంతే. ఒక కాలంలోని భాషనుగానీ ఒక ప్రాంతంలోని భాషనుగానీ తీసుకొని  భాషాస్వరూపమూ, స్థితీ ఇదీ అనీ,  ఎప్పటికీ ఇవి ఇలాగే ఉంటాయనీ నిర్ణయించలేం. ఒకప్పుడు, మహా సామ్రాజ్యాలకూ, సంస్కృతులకూ మతాలకూ జ్ఞాననిధులకూ ఆలవాలమైన సంస్కృతం,  లాటినూ, గ్రీకూ ఈజిప్షియనూ, హిబ్రూ మొదలైన ఎన్నో ప్రాచీన భాషలుసైతం తమ స్థితీ గతీ కోల్పోయి నిర్వీర్యమైపోయాయి. నిన్నమొన్నటిదాకా ఊరూ పేరూ లేని చిన్నాచితకా భాషలు గడచిన రెండువందల సంవత్సరాలలో ప్రపంచ భాషలుగా చెలరేగిపోయాయి. దీనికి కారణం  ఆయా భాషల వ్యవహర్తల ఆధిపత్యపు పోరు. అందులో పెంచి పోషించిన సైనిక పటాలాలు. వారు సాగించిన ఉన్మత్త పైశాచిక హత్యాకాండలు. నరమేధాలు. అంతులేని ఎల్లలెరుగని జాతివిధ్వంసం. ఇవన్నీ.. ఇవన్నీ కూడా కారణాలు. వీటిద్వారా ప్రజలను భయభ్రాంతులను చేసి, రాజకీయంగా పైచేయి సాధించి,  ఆయా ప్రాంత ప్రజలపై   పెత్తనం చేస్తూ  తద్వారా తమ భాషలను ప్రపంచపటంపై లిఖించారు. రాయడం రాని తుంటరి పిల్లలు తెల్లకాగితంపై చెరపరాని చిత్తడి చిత్తడి  రంగులు పులిమినట్లు వారి భాషలను మనపై   బలవంతంగా రుద్దివేశారు. దాని పర్యవసానం, ఈ నేలపై సంస్కృతికీ సంస్కారానికీ  నూకలు చెల్లుతున్న తరుణం ఆసన్నమయింది. నాటు భాషల ఆనవాళ్లు చెరిగేపోయే కాలం దాపురించింది. భాషావిధ్వంసం జాతివిధ్వంసానికి మూలం. వందల ఏళ్ల బానిసత్వంనుండి బైటపడి పూర్తిగా ఒక్క తరమైనా కాలేదు అప్పుడే  మానసిక బానిసత్వంతో భావదాస్యంలోకి కూరుకుపోతున్న సంకటస్థితి.

2.0 ప్రాచీన భారతంలో భాషా స్థితి:
భారతదేశంలో  భాషా స్థితిగతులగురించి చెప్పుకోవాలంటే రెండువేల ఐదువందల సంవత్సరాల ప్రత్యక్ష చరిత్రా, అంతకుముందు ఇంకొక రెండువేల ఐదువందల సంవత్సరాలపాటు పరోక్ష చరిత్రా అవసరం. క్రీస్తుపూర్వం రెండువేల  సంవత్సరాలకిందట జరిగిన ఋగ్వేద రచన ఒక ఎత్తైతే, దీనికి సమాంతరంగానో లేక కొంత ముందుగానో నడచిన సింధులోయ నాగరికత మరో ఎత్తు. ఆ నాగరికతలో  తెలియని లిపిలో నిక్షిప్తమైవున్న ప్రాచీన భారత ఉపఖండపు భాషా సంస్కృతుల అస్తిత్వానికి ఆనవాళ్లుగా నిలుస్తూ దొరికిన వందలకొలదీ  ముద్రలూ, అచ్చులూ, పలకలూను. సింధులోయ భాష ఇప్పటి ఒకానొక భాషాకుటుంబానికి చెందినది అని ఇదమిత్థంగా తెలియకపోయినా తప్పక ఏదోఒక భారత ఉపఖండపు భాషే ఐవుంటుందని ఊహించవచ్చు. భారత ఉపఖండంలో అన్నిటికంటే ముందుగా వినబడినభాష - మధ్యభారతంలోని నెహాలీకి ప్రాగ్రూపం ఐవుండాలి. ఇంకా చెప్పాలంటే అండమాన్ నికోబరీస్ దీవులలో మిగిలిన ప్రాచీన పాతరాతియుగపు ఆనవాళ్లుగా నిలిచిన గ్రేట్ అండమానీసు, ఓంగన్, నికోబరీస్ మొదలైనవి ఆస్ట్రో-ఏశియాటిక్ భాషా కుటుంబానికి చెందినవిగా గుర్తింపుపొందినవి. ఈ భాషాకుటుంబానికి చెందినవే ముండా ఉపకుటుంబ భాషలూ, మోన్ఖ్మేర్ ఉపకుటుంబానికి చెందిన ఖాసీ లాంటివి కొన్నీ ఉన్నాయి. ఈ ఆస్ట్రో-ఏశియాటిక్ భాషలు మాట్లాడేవారే మొట్టమొదటగా భారతదేశంలో మాట్లాడిన భాషలు కావచ్చు. ఇట్లా అనుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. 1948లో క్వైపర్,  ప్రకటించిన వైదిక-సంస్కృతంలో మూల-ముండా పదజాలం’  అనే పత్రంలో   భారతదేశంలోని వ్యవసాయ సంబంధమైన పదజాలం  ఈ ముండా, నెహాలీ భాషాసమూహాలదే అంటారు. ఐతే ఆ తరువాత వచ్చిన ద్రావిడ భాషీయులూ ఆర్య భాషాసమూహాలూ ఈ పదజాలాన్ని కొంతవరకూ సొంతం చేసుకున్నారు. కొందరి భాషాశాస్త్రజ్ఞుల ప్రకారం భారతదేశంలో  30% వ్యవసాయ పదజాలం ముండా భాషలనుండీ, మరో 30% ద్రావిడ భాషలనుండీ సంక్రమించినదే అంటారు. షుమారు మూడు నుండి నాలుగువేల సంవత్సరాలకిందట  అప్పటికే ఇక్కడవున్న స్థానిక ముండా, నెహాలీ తదితర భాషావ్యవహర్తలు వాయవ్య ప్రాంతంనుండి వచ్చిన ద్రావిడ భాషా సమూహాల ఆధిపత్య ప్రభావంతో తమ భాషల్ని వదిలిపెట్టి ద్రావిడ భాషలను సొంతం చేసుకున్నారు. అంటే, దక్షిణభారత దేశంలో ఉన్న ప్రస్తుత ద్రావిడ భాషీయులలో అధిక శాతం అప్పటికే ఉన్న ప్రాచీన ఆదిమజాతులకు చెందినవారే, ఐతే భాషపరంగా మాత్రం ద్రావిడులు. అంటే ఇప్పటి ద్రావిడ భాషా సమూహాలు జాతి పరంగా ఎప్పటినుండో భారతదేశంలో ఉంటున్న ప్రాచీన ఆదిమ జాతులూ ఆతర్వాత వచ్చిన ఆర్వాచీన జాతుల సమాహారమే.   అట్లాగే ఆ తరువాత వచ్చిన హింద్వార్య భాషా సమూహాల ప్రభావంతో అప్పటికే ఉత్తరాదిన ఉన్న ద్రావిడ, ముండా తదితర భాషా సమూహాలు ఎన్నో  తమ  భాషలను వదిలిపెట్టి ఆర్య భాషలను సొంతం జేసుకున్నాయి.   అంటే ఎన్నోసార్లు భారత ఉపఖండంలోని జాతులు తమ తమ మాతృభాషలను కొన్ని ఇబ్బందికర పరిస్థితులలో వదులుకొని ఆధిపత్య, పాలక భాషలను ఎంచుకోవాల్సివచ్చింది. అది ప్రజాస్వామ్యం  లేని కాలం. బలవంతులు బలహీనులను ధన, మానాదులతోపాటు భాషా సంస్కృతులను కొల్లగొట్టిన వేళ. చరిత్రకు అందని కాలంలోనూ చారిత్రక ప్రభాత సంధ్యలలోనూ జరిగిన ఈ బలవంతపు మార్పులు కోకొల్లలు. ఐతే బలవంతపు కారణాలవలననే కావచ్చు లేక ఇతరులు సృష్టించిన అత్యవసర పరిస్థితులే కావచ్చు మానవ సమూహాలమధ్య మధ్యకాలీన సమాజాలలో కూడా భాషల బలవంతపు మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. ఐతే వీటి ప్రభావం కొంత మేరకే. ఆనాటి జనాభాకు నేలా నీరూ తదితర వనరులకు కొదవ లేకపోవడంతో బలవంతపు మార్పిడులనుండి తప్పించుకునేందుకు వీలుగా తాము ఉంటున్న జనావాసాలను వదిలి సుదూరంగా వలసవెళ్లారు. ఇట్లా పరుల ఆధిపత్యపు నీడ పడనంతదూరంలో తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లనిచోట కొత్తవలసలను ఏర్పరచుకున్న సందర్భాలు చరిత్రలో కోకొల్లలు.

3.0 వలస భారతంలో భారతీయ భాషలూ- ఇంగ్లీషు:
లార్డ్ విలియం బెంటింక్ కొత్త విద్యా విధానంతో,  ‘ఈ దేశ  ఆధికారిక భాషగా ఇంగ్లీష్ పరిచయం అయింది. ఆ విధానం ఆంగ్ల భాషా మాధ్యమం ద్వారా భారతదేశంలో పడమటిదేశాల విద్యా వ్యాప్తికీ ఆ పై సంస్కృతి వ్యాప్తికీ దారితీసింది. ఆధునిక విజ్ఞానం, పడమటి విద్యావిధానంతో ప్రభావితులైన కొందరు భారతీయులు రామ్మోహన్ రాయ్  నాయకత్వంలో   ఆంగ్ల భాషవైపు మొగ్గుచూపారు. ఐతే, అప్పట్లో వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన రెండు వర్గాలు ఉండేవి. తూర్పు దేశాల సాంస్కృతిక భాషలైన సంస్కృతం, అరబిక్   పర్షియన్ కు అనుకూలమైనవారు ప్రాచ్యవాదులనీ  ఇంగ్లీష్ కు అనుకూలం అనుకునేవారిని ఆంగ్లవాదులనీ   పిలిచారు.   ఇదే ఆ తరువాత  ఆంగ్ల-ప్రాచ్య వివాదం గా ప్రసిద్ధి చెందింది.
                                                           
ఈ వివాదం పది సంవత్సరాలు నడిచింది.  బెంటింక్ భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చేముందు కూడా ఐదు సంవత్సరాలు ఈ వివాదం నడిచింది. రామమోహన్ రాయ్ - సంస్కృతానికి వ్యతిరేకంగా ఆనాటి బ్రిటిషు ప్రభుత్వానికి ఒక అభ్యంతరపత్రాన్ని సమర్పిస్తూ  అందులో ఇప్పటికే అటువంటి విద్యను బోధిస్తుండగా, మళ్లీ ప్రభుత్వంవారు హిందూ పండితులతో ఒక సంస్కృత పాఠశాలను (కలకత్తాలో) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది నిర్ణయం వ్యక్తికీ సమాజానికీ ఉపయోగపడని  వ్యాకరణ సౌందర్యాలనూ అధిభౌతిక తత్త్వశాస్త్ర సూక్ష్మభేదాలనూ యువత బుర్రలలో నింపుతుందని మాత్రమే అనుకోవచ్చు అని తన అభ్యంతరాన్ని తెలియజేశాడు. ఆయన తన అభ్యంతరపత్రంలో గణితం, సామాన్య తత్త్వశాస్త్రం, రసాయన, శరీర సంరచన లాంటి ఇతర ఆచరణాత్మక శాస్త్ర విషయాలను ఎన్నిటినో బోధించే ఉదారవాద జ్ఞానసంపన్న  వ్యవస్థ కోసం అభ్యర్థించాడు.  క్లుప్తంగా చెప్పాలంటే, రామ్మోహన్ రాయ్ తన మద్దతుదారుల్తో కలిసి ఇంగ్లీషు మాధ్యమంలో పడమటి విద్యకోసం వాదించాడు.
 ఆంగ్ల ప్రాచ్యవాదులకు తూర్పుదేశాల లేక భారతీయ విద్యా వ్యవస్థ అతి విలువైనదిగా కనబడింది. వారిలో కొంతమంది గంభీరమైన పాండిత్యం గలవారు ఉన్నారు. వారు ప్రాచీన భాషలను ఎంతో కష్టపడి చదివారు. కొంతమంది సంస్కృతాన్ని జ్ఞాననిధిగా భావించారు.   వారిలో కొంతమంది పాశ్చాత్యులే, భారతీయులు తమ దేశ సంస్కృతీ శాస్త్రాలను తమ భాషలలోనే నేర్చుకోవాలని వాదించారు. వారిలో గుర్తింపుపొంది ప్రసిద్ధులైనవారు హొరేస్ హైమన్ విల్సన్, ఎచ్.టి. ప్రిన్సెప్, ఇంకా డబ్లూ ఎచ్. మెక్నోటెన్. వరిలో కొంతమంది, “సంస్కృతం అరబ్బీ భాషలలో ఉన్న తత్త్వశాస్త్రాలు ఇతర భాషలలో అధ్యయనం చేసినట్లే ఆ భాషలలోకూడా  చదవవచ్చు అని అన్నారు. రతీయుల అంకగణితం, బీజగణితం అవే ఫలితాలను ఇస్తాయి. యూరపులో ఉన్న  నియమాలపై ఆధారపడినవే. మద్రసాలలో నేర్పే గణితశాస్త్ర మౌలికాంశాలు యూక్లిడ్ కి సంబంధించినవే.
3.1 ఈ వివాదం తీవ్రంగా ఉన్నప్పుడు బెంటింక్ భారతదేశం చేరుకున్నాడు. గవర్నర్-జనరల్  దీన్ని చాలా సంక్లిష్ట విషయంగా పరిగణించాడు. చాలా పరిపాలనా విభాగాలలో భారతీయులను నియమించాలి అనుకుంటున్నాడు కాబట్టి  దానికోసం ఇంగ్లీషులో విద్య అవసరం అని అనుకొన్నాడు. కానీ నిర్ధారణకు వచ్చేందుకు కొంత కాలంగా వేచిచూస్తున్నాడు.
  1834లో లార్డ్ మెకాలే ఇండియా రావటం జరిగింది. ఇతనికి గవర్నర్ జనరల్ మండలిలో న్యాయ సభ్యుడిగానేగాక విద్యా విషయాల బాధ్యతనుగూడా అప్పజెప్పాడు. ఈ పరిస్థితిలో మెకాలే ఆనాటి భారతదేశానికి విద్యావిధానాన్ని తయారుచేసే పనిలో మునిగిపోయాడు. ఐతే, ఆయనకు ప్రాచ్య దేశాలగురించి తెలిసింది తక్కువ. ప్రాచ్య విద్యపైగానీ ప్రాచ్య భాషలన్నాగానీ గౌరవం లేదు. సహజంగానే ప్రాచ్యవిద్యావాదులను ఈసడించుకొని ఆంగ్లవాదులను సమర్థించాడు. 1835 ప్రారంభంలోనే భారతదేశపు  విద్యావిధాన నివేదికను  పరతంత్ర భారత  ప్రభుత్వ పరిశీలనకు సమర్పిం చాడు.
3.2  మెకాలేగారి విద్యావిధాన నివేదికగా ఖ్యాతిని సంపాదించుకున్న ఈ నివేదికలో పనిగట్టుకొని సంస్కృత అరబ్బీ భాషలనూ ప్రాచ్య దేశాల సాహిత్యాన్నీ, విజ్ఞానాన్ని నిశితంగా విమర్శించాడు. ప్రాచ్య భాషాసాహిత్యాలను విమర్శిస్తూనే ఆంగ్ల భాషను బాగా ప్రశంసించాడు. అందులో ఇంగ్లీషును భారతదేశపు పాలక భాషగానూ అభివర్ణించాడు. ఐతే మెకాలే ఊహించనిది నేడు  కొంత నిజం ఔతున్నదేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇంగ్లీషు భాష భారతీయ సామాన్య జనవ్యవహారంలోకి త్వరత్వరగా వచ్చేస్తోంది. కానీ మెకాలే అనుకున్నదల్లా ఇంగ్లీషు భాష ప్రాచ్య విద్యా విధానంద్వారా ప్రాచ్య దేశాల వ్యాపార భాషగానూ సామ్రాజ్యాధిపత్య భాషగానూ విస్తరిల్లాలని మాత్రమే. ప్రజల భాషగా కాదు.
 మెకాలే దేశభాషల ద్వారా జనాదరణకలిగిన విద్యావిధానంగురించి ప్రస్తావించలేదు. నాడు బ్రిటిషు ప్రభుత్వ పాలకులకూ కోట్లాది జనులకూ మధ్య దుబాసీలుగా పనిచేసే  భారతీయులను  రక్తమూ రంగూ భారతీయమైనా  రుచీ అభిరుచులలోనూ  ఆచారాలూ ఆలోచనలలోనూ నీతికీ బుద్ధికీ ఆంగ్లమానస పుత్రులైన ఒక వర్గాన్ని తయారు చేయాలన్నదే ఆయన కోరిక. ఈ వర్గమే దేశభాషలను సంస్కరించి, శాస్త్ర పరిభాషను రూపొందించి, వాటిని ఆధునిక అవసరాలకు మహాజనసామాన్యానికి జ్ఞానాన్ని అందించే దిశగా సాగాలని ఉద్దేశించాడు. ఇట్లా మెకాలే ఇంగ్లీషును  భారతదేశపు ఉన్నత విద్యాభాషగానూ పడమటి విజ్ఞానాన్ని అధ్యయన అధ్యాపన విషయాలుగా  చేయాలని సూచించాడు. ఇలాంటిదానికే ఎదురుచూస్తున్న బెంటింక్ వెంటనే దీనికి ఆమోదం తెలిపాడు. దీని ఆధారంగా, 1835 మార్చి 7వ తేదీన ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మాన సారాంశమే, ‘ఏలినవారి అభిప్రాయం ఏమిటంటే బ్రిటిషు ప్రభుత్వంవారి ఘనమైన లక్ష్యం యూరోపియన్ సాహిత్యమూ విజ్ఞానాన్ని భారతీయులలో పెంపొందించడం. ఇలాంటి విద్యకోసం ఉద్దేశించిన నిధులను పూర్తిగా ఇంగ్లీషు విద్యకోసమే వినియోగించాలి అని.
3.3 భారతీయ భాషల హక్కుల హరణం: బెంటింక్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన భారతీయ విద్యావ్యవస్థ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆనాటినుంచే పడమటి విద్యవిధానంతోపాటు ఇంగ్లీషు వాడకం వేళ్లూనుకొంది. కొత్తగా ప్రారంభించిన కాలేజీలూ విశ్వవిద్యాలయాలతోనూ వాటివల్ల వచ్చిన ఉద్యోగాల లభ్యతవలన ఇంగ్లీషు నేర్చుకోవాలనే తపన పెరిగింది.  ఈ చారిత్రాత్మక మార్పు భారతదేశపు వేల సంవత్సరాల వారసత్వ సంపదగా సంక్రమించిన భాషా సంస్కృతులకు పోయేకాలం దాపురించిపెట్టిన ఘనత మెకాలేకు దక్కుతుంది.
అంటే నూట ఎనభై ఏళ్లకిందట ప్రారంభమైన ఆంగ్ల విద్యావిధానం ఒకరకంగా దేశీయ భాషల ప్రయోజకత్వాన్ని ప్రశ్నించేదిగా తయారైంది. దానికి కారణం కేంబ్రిడ్జి ఆక్స్ఫర్డు మాదిరి 1857 నుండి ప్రారంభమైన విశ్వవిద్యాలయాలూ, కళాశాలలు, ఉన్నత పాఠశాలలూ. వాటిలో చదివినవారికే బ్రిటీషు పాలనలో ఉద్యోగాలు. 1854వరకూ భారతదేశం వచ్చిన ఆంగ్లేయులూ, యూరోపియన్లూ, తదితర అధికారులూ అందరూ స్థానిక భాషలను అధ్యయనం చేస్తూ స్థానిక పండితులనుండీ స్థానిక భాషలను నేర్చుకొంటూ ఉండేవారు. ఈస్టు ఇండియా కంపెనీ ఏలుబడిలో భారతీయ భాషలలోనే పాలన సాగింది. అది ఇప్పుడు ఒక్కసారిగా ఇంగ్లీషుకు మళ్లడం, ఆంగ్లవిద్యను జీవనానికి ముడిపెట్టడం ఒకేసారి జరిగిపోయింది. ఇది భారతీయ భాషలకు ఊహించరాని దెబ్బ. బ్రిటిషు ఇండియాలో ప్రభుత్వం ఆధికారికంగా ఒకే భాషతో పనిచేసింది. అదే ఇంగ్లీషు. ఆనాడే భారతీయ భాషలకు చెల్లుచీటీ రాయడం జరిగింది. ఐతే ఉద్యోగాలు తక్కువ అవడం, అత్యధిక జనం 99% స్థానిక సాంప్రదాయిక వనరులైన వ్యవసాయమూవృత్తిపనులపై ఆధారపడడం చేత భారతీయ భాషలకు ఏమంత నష్టం జరగనట్లే అనుకోవాలి. ఇంగ్లీషు విద్యావిధానంతో హైస్కూలువిద్యవరకూ తెలుగులోనూ ఆపైన కళాశాల లేక విశ్వవిద్యాలయ చదువులు ఐచ్ఛికంగా ఇంగ్లీషులో ఉండడం వలన ఇంగ్లీషు పరిపూరక స్థితిలో ఉండేది. అంటే ఇంగ్లీషు కొన్ని రంగాలకే పరిమితమై ఉండేది. ఉదాహరణకు  ఉన్నత విద్య, ప్రభుత్వ పాలనా న్యాయ రంగాలకే పరిమితం. తెలుగూ తదితర భారతీయ భాషలను ఇతర రంగాలన్నింటా స్వేచ్ఛగా వాడుతుండేవారు. ఇదే కాలంలో ఇంగ్లీషు విద్య వలన దాని ప్రభావంతో భారతీయ భాషల వాడకంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగులో ఆంగ్ల లేక యూరోపియను భాషా సరళిలో వ్యాకరణాల రచనా, నిఘంటువుల నిర్మాణంవచన రచనల వాడకం పెరగడం ఒకరకంగా రచనా భాషను ప్రజలకు చేరువచేసే ప్రయత్నం జరిగింది. అయితే ఉన్నత విజ్ఞాన భాషలుగా పాలనాభాషలుగా వాడకానికి వీలులేకుండా చేయడం కాళ్లూ చేతులూ విరిచి రెక్కలు కట్టినట్లు ముందుకు సాగడానికి వీలులేకుండా శాశ్వతంగా వైకల్యాన్ని అంటగట్టింది. ఇది తెలుగుకూ తదితర భారతీయ భాషలకూ కోలుకోలేని స్థితికి తీసుకువెళ్లింది.

ఆధునిక యుగంలో ఏర్పడిన సామాజికభాషా సంక్లిష్టతకు  వ్యాపారం, ఉద్యోగం, సంస్కృతి, విజ్ఞానంవంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రభావాలవల్ల ఆధునిక  సమాజంలో వినిమయ వస్తుసముదాయాన్ని పునర్నిర్వచించవలసివస్తోంది. నేడు భాషఒక వినిమయ వస్తువు. ఒకప్పటి సాంస్కృతిక ఉపకరణం   అత్యంత వేగంతో నేడు సామాజిక ఉన్నతికి ఉపకరణంగా మారుతోంది.

4.0 స్వాతంత్ర్య  భారతంలో ఇంగ్లీష్:
నూట పాతిక కోట్ల మంది ప్రజలూ వేలాది భాషలూ ఉన్న భారతదేశంలో ఇంగ్లీషుది సహాయక అధికార  భాషా   స్థాయి. ఐనా, నిజానికి ఇదే భారతదేశపు  అతి ముఖ్యమైన భాష. హిందీ తరువాత అది భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ  కలిగిన భాష. అయినా  అది భారతదేశంలో చాలా మంది చదివి రాయగలిగిన భాష కాదు. ఆంగ్లభాషలో ప్రవేశం  జ్ఞానానికీ,  విద్యకూ,   తెలివికీ సామాజిక స్థాయికీ సూచిక. ఇంగ్లీష్ తెలిసిన భారతీయులు తరచుగా వారి సంభాషణలలో భారతీయ భాషలతో ఆంగ్లాన్ని  కలగలిపి వాడటం సర్వసాధారణం.  భారతీయుల ఆంగ్లం,  అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిషు ఇంగ్లీషు, కెనేడియన్  ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ ఇంగ్లీషుల లాగా ఒక ప్రధాన మాండలికం. ఇది వివిధ భాషలు మాట్లాడే భారతీయుల్లో లింకు భాషగా పనిచేస్తోంది. చట్టపరమైన, ఆర్థిక, విద్యా, వ్యాపార – వివిధ  రంగాలలో భారతదేశంలో ఇంగ్లీష్  ఎన్నదగినంత ఉపయోగంలో  ఉంది.   భారతీయులలో ఇంగ్లీష్ అటువంటి ప్రాముఖ్యత పొందడానికి ప్రధాన కారణం భారతదేశం, బ్రిటిషువారి వలస రాజ్యంగా పరాయి పాలనకింద రెండు వందల ఏండ్లుగా నడిచిన  గత చరిత్రే.

భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు ఆంగ్లభాషా పరిజ్ఞానం కలిగివున్నారు అని వికీపీడియావారి అంచనా. వారిని,  ‘‘ఇంగ్లీష్ మాట్లాడేవారు,  ‘‘ఇంగ్లీష్ వాడేవారు - అని రెండు వర్గాలుగా విభజించవచ్చు అన్నారు. ఇంగ్లీష్ వాడేవారు అంటే ఇంగ్లీషును చదవడం  మాత్రమే    తెలిసినవారు.  ఇంగ్లీష్ మాట్లాడేవారు అంటే, ఇంగ్లీష్ చదవడం, మాట్లాడం,   అర్థం చేసుకోగలిగినవారు.  ఇట్లా భారతదేశంలో   10 కోట్లకు పైగా ఆంగ్ల భాషను మాట్లాడేవారు ఉన్నారు. భారతదేశపు మొత్తం జనాభా నూట పాతిక కోట్లు కాగా, వారిలో సగం 25 ఏళ్లవారు -అంటే వారిలో   55 కోట్లమంది యువకులే.  ఇంగ్లీష్ మాట్లాడేవారి శాతం వయోజన భారతీయుల్లో  కంటే యువ భారతీయుల్లో ఎక్కువ.  ఇంగ్లీష్ మాట్లాడేవారు   మొత్తం భారత జనాభాలో   9%  ఉన్నట్లు అంచనా.   అమెరికా సంయుక్త రాష్ట్రాల తర్వాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆంగ్లం మాట్లాడే దేశంగా  భారతదేశం ఆవిర్భవించింది.   వైవిధ్యంలో, భారతదేశాన్ని  మొత్తం ఐరోపా ఖండంతో పోల్చవచ్చు. భారతీయ రాష్ట్రాలు కొన్ని యూరోపియన్ దేశాల కంటే   పెద్దవిగా  ఉన్నాయి. ప్రతి  రాష్ట్రానికీ దాని సొంత సంస్కృతీ   దాని స్వంత భాష  ఉన్నాయి. ప్రతి భారతీయ భాషా మరో భారతీయ భాషకు  భిన్నంగా ఉంటుంది. ప్రతి భారతీయ భాషకూ దాని సొంత లిపి -    ఉంటుంది.   నేడు,  విద్యావంతులైన భారతీయుల్లో ఇంగ్లీషు ఒక అనధికారిక ‘‘ఉమ్మడి’ భాష. భిన్నరాష్ట్రాల   భారతీయులు ఇద్దరు కలిస్తే, వాళ్ల సంభాషణ  ఇంగ్లీష్ లోనే ఉండటం సర్వసాధారణం. నేడు కార్పొరేట్ వ్యాపారం, బ్యాంకింగ్, విద్య,  ప్రభుత్వపాలనా రంగాలలో ఆంగ్లానిదే పైచేయి. భారతదేశంలో   కంప్యూటర్ వినియోగదారులు ఉపయోగించేది - ఇంగ్లీషే. భారతదేశపు సమాచార ప్రసార సాధనాలలో  ప్రధాన నగరాలలో ఇంగ్లీష్ ఛానెళ్ల వాడకం ఎక్కువే.  ప్రపంచంలోనే అతిపెద్ద వార్తా పత్రికలలో మొదటి రెండు స్థానాలలో ఉన్న హిందుస్తాన్ టైమ్స్ మరియు ది హిందూ ఆంగ్ల దినపత్రికలు భారతదేశంలోనివే.    భారతదేశపు సామాజిక కలనేతలో ఇంగ్లీష్ పాత్ర చాలా విలక్షణమైనది. భారత దేశానికి పట్టణం, గ్రామీణం అనే రెండు ముఖాలు ఉన్నాయి. గ్రామీణ భారతదేశం ఇంగ్లీష్ మాట్లాడటం లేదు, అయితే పట్టణ ప్రజలలో   చెప్పుకోదగినంత మంది  ఇంగ్లీష్ వాడుతుండవచ్చు.  భారతదేశంలో   ఇంగ్లీష్ సామాజిక ఉన్నతికి సూచికగా మారింది. భారతీయ సమాజంలో ఉన్నత, మధ్య తరగతి వర్గాలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలవు. నేడు, ఆంగ్లభాషా పరిజ్ఞానం సామాజిక ఉన్నతికి   ఒక అత్యవసరం.

భారతదేశపు ఉన్నత విద్యా మాధ్యమ భాషగా పిలవని పేరంటానికి  వచ్చిన ఇంగ్లీష్,  ఓ  అమర్యాదకరమైన ధోరణిలో నెరపుతున్న కర్రపెత్తనం,    భారతీయ భాషలను  అటకెక్కించివేసే దిశలో సాగుతోంది. ఈ విషయాన్ని ఆలంకారికంగా చెప్పాలంటే భారతీయులు  ఇంగ్లీషు సరొగేట్ తల్లికి  మారుటి పిల్లలు అని చెప్పవచ్చు.
   
5.0 భారతీయ భాషలూ- ఇంగ్లీషూ: స్థితి - పరిస్థితి: సాహిత్య,  విద్యారంగాలు:
భారతీయ భాషలు గడచిన రెండువందల ఏండ్లలో ఇంగ్లీషు తదితర పాశ్చాత్య భాషా ప్రభావానికి గురయ్యాయి. పరభాషా ప్రభావం భారతీయ భాషలకు కొత్త విషయమేమీ కాకపోయినా పాశ్చాత్య భాషల ప్రభావం భారతీయ భాషలలో అనేక రకాల మార్పులు చోటుచేసుకునేందుకు దోహదంచేశాయి. ఈ ప్రభావం భారతీయ భాషలలో గుణాత్మకమైన మార్పులకూ పరిపుష్టికీ దోహదంచేసినా ఉత్తరోత్తరా వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేలాగా చేసింది అనాలి. అంటే అప్పటివరకూ అన్ని రంగాలలోనూ వాడుతున్న భారతీయ భాషలు  ఇప్పుడు కొన్ని రంగాలకే పరిమితం కావడం ఒక ఊహించరాని పరిణామం. అంటే విద్య, వైద్య, ఉద్యోగ రంగాలనుండి భారతీయ భాషలు మెల్లగా తమ వాడకంనుండి వైదొలగడం  భవిష్యత్తులో వాటి ఉనికికే చేటుతెచ్చింది. ఆధునిక భారతీయ భాషల వాడకం ఇట్లా కొన్ని రంగాలకే పరిమితం కావడం ఇదే మొదటిసారి కాదు. ప్రాచీన భారతంలో ఆధునిక భారతీయ భాషల వాడకం     ఒకటి రెండు అలౌకిక రంగాలలో సంస్కృత ప్రాకృతాలకు తావిచ్చిన సందర్భాలు ఉన్నా అక్కడ వాటి వాడకం కొంతవరకూ పరిమితమే. అది ఆధునిక భారతీయ భాషల ఉనికికి ఎట్లాంటి విఘాతాన్ని కలిగించలేదు.  అది లౌకిక వ్యవహార రంగం కాకపోవడంచేత ఆధునిక భారతీయ భాషలను మాట్లాడే  ప్రజలపై దాని ప్రభావం అతితక్కువ. అంత్యంత  ముఖ్యమైన లౌకిక వ్యవహార రంగాలలో  భారతీయ భాషల స్థానే ఇంగ్లీషు వాడకం విస్తరించడంతో భారతీయ భాషలకు పరిపుష్టిని కలిగించే వాడుకకు బీటలు పడి వాటి వినాశనానికి బాటలు వేసింది.

 5.1 తెలుగు సాహిత్యంపై ఆంగ్లసాహిత్య ప్రభావం: ఆధునిక యుగంలో ఆంగ్లభాషా పరిచయం వలన మన  సాహిత్యం పరిపుష్టి అయిందని చెప్పవచ్చుఆంగ్లసాహిత్యాన్ని చదివి, అక్కడి భావజాలమే కాకుండా సాహితీ ప్రక్రియలు సైతం దిగుమతి అయ్యాయికథ, నవల, ఖండకావ్యం, ఆత్మకథ, జీవితచరిత్ర లాంటి ప్రక్రియలెన్నో తెలుగులో ఆవిర్బవించాయి. ఉదాహరణకు ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే రచననే తీసుకుంటే దీనికి మూలం  జోనాథన్‌ స్విఫ్ట్ రాసిన ‘గలివర్‌ ట్రావెల్స్ అనే రచన మూలంతర్వాతికాలంలో అనేక రచయితలు విదేశీ రచయితలచేత ప్రభావితులయ్యారు. ఎడిసన్‌ రాసిన ‘స్పెక్టేటర్‌’ను చదివిన తరువాతే పానుగంటివారు ‘సాక్షి’ని సృష్టించారు. భమిడిపాటి, మొక్కపాటివారి నాటక సృజన మోలియర్‌ నాటకాలు చదివిన ప్రభావమే. పిజి ఉడ్‌హౌస్‌ రచనలకు ప్రభావితులైన తెలుగు రచయితలలో పాలగుమ్మి పద్మరాజుతో సహా  ఎందరో రచయితలు వున్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర వంటి మహామహుల  హాస్యపద్య రచన ఆగ్డెన్‌ నాష్‌ రాసిన లిమరిక్స్ ప్రభావమే. ఆధునికి విమర్శ కూడా భారతీయ లంకారశాస్త్ర పరిధిని దాటి పాశ్చాత్య ప్రభావంతో కొత్తపుంతలు తొక్కింది.

5.2 తెలుగు వ్యాకరణ రచనపై ఆంగ్లభాషాప్రభావంసంప్రదాయ సాహిత్యంపైనే కాక అలంకారాది శాస్త్రాలపై కూడా సంస్కృత భాషాప్రభావం అధికంగా ఉన్న కాలంలో తెలుగు వ్యాకరణ రచన సంస్కృత వ్యాకరణ సంప్రదాయాలను అనుసరించింది. కొన్ని వ్యాకరణాలు, వ్యాఖ్యానాలు సంస్కృతవ్యాకరణ ప్రభావంతో వెలుగు చూశాయి.
తరువాత కాలం మారింది. కాలంతోపాటు అవసరాలూ మారాయి. ఆంగ్లేయులు తెరమీదికి వచ్చారు. వారి రాక భారతీయ సంస్కృతి సంప్రదాయాలనే కాక భాషా సాహిత్యాలనూ ప్రభావితం చేసింది. ప్రాచీనపద్ధతిలో వచ్చిన సంస్కృతంలో ఉన్న తెలుగు వ్యాకరణాలు విద్యార్థులకు సులభంగా అర్థం కావడంలేదనే భావన కలిగింది. పద్యరూపంలోనో, సంస్కృతంలోనో సూత్రప్రాయంగానో ఉండడం వల్ల వ్యాకరణాన్ని సులభంగా అర్థం చేసుకోవడంలో వైఫల్యాలు తొంగిచూశాయి.  
అవసరాన్ని పూరించేందుకు ఆంగ్ల విద్యావిధానం ఫలితంగా తెలుగులో లఘువ్యాకరణ రచన ప్రారంభమైంది. ప్రాచీన వ్యాకరణాలను, వాటిపై గల ప్రభావాలను అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రసిద్ధ భాషా పండితులు కొందరు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించే అధ్యాపకులుగా ఉండటం రకమైన వ్యాకరణాలు రావడానికి దోహదం చేసింది.
తెలుగు దేశంలో తమ వ్యవహార కార్యకలాపాలను సమర్థంగా నిర్వర్తించడానికి తెలుగు భాషను నేర్చుకోవలసిన అవసరం ఆంగ్లేయులకు ఏర్పడింది. ముఖ్యంగా లేఖన భాషలోనూ, వాడుక భాషలోనూ ప్రావీణ్యం సంపాదించడానికి, తెలుగు పండితుల చేత ఆంగ్లేయులు వ్యాకరణాలను రాయించుకొన్నారు. విధంగా తెలుగు వ్యాకరణాలు ఆంగ్లంలో కూడా వెలుగు చూశాయి. పుదూరి సీతారామశాస్త్రి (క్రీ. . 1834) ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం, రావిపాటి గురుమూర్తిశాస్త్రి (1770-1836) తెనుఁగు వ్యాకరణం, వడ్లమూడి గోపాలకృష్ణయ్య (1958) వ్యావహారిక భాషావ్యాకరణం, మల్లాది సూర్యనారాయణశాస్త్రి (క్రీ. . 1926)  ఆంధ్రభాషానుశాసనం, వి. వేంకటేశ్వర్లు (క్రీ. . 1982) ప్రామాణికాంధ్రవ్యాకరణం ఆంగ్లభాషావిధాన్ని అనుసరించి వచ్చిన వ్యాకరణాలే.
5.3 తెలుగు నిఘంటువులపై ఆంగ్లభాషా ప్రభావం: వైదిక, లౌకిక సంస్కృత పదాలకు వ్యత్యాసం ఉండడం వల్ల నిఘంటు నిర్మాణావశ్యకతను ప్రాచీనకాలంలోనే మనవారు గుర్తించారు. సంస్కృతనిఘంటువులలో వైదిక నిఘంటువు, యాస్కుని నిరుక్తం, అమరకోశం మూడూ సలక్షణమయిన నిఘంటువులు. ప్రాచీన అర్వాచీన నిఘంటు నిర్మాణపద్ధతులకు మూలాలు నిఘంటుత్రయం నుండే అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు.
తెలుగుభాషకు సంబంధించి నిఘంటురచన క్రీ. . 17 శతాబ్ది నుండి ప్రారంభమైంది. తెలుగు భాషా సాహిత్యాలపై సంస్కృత భాషా ప్రభావం ఉండటం వల్ల సంస్కృతంలోని అమరకోశాదుల అధ్యయనం తెలుగు వారికి అవసరమైంది. అందువల్ల 17 శతాబ్ది వరకు నిఘంటునిర్మాణానికి ప్రయత్నాలు జరగలేదు. అనంతర కాలంలో అచ్చతెలుగు కావ్యాలు ఆవిర్భవించాయి. అన్యదేశ్య ప్రయోగాలు కూడా కావ్యాలలో పెరిగాయి. కాబట్టి తెలుగుభాషకు సంస్కృత కోశాలు పరిపూర్ణంగా ఉపయుక్తాలు కావనే  భావన కల్గింది. అప్పటి నుండి పద్యనిఘంటువులు ఆవిర్భవించాయి. అయితే ఇవి కూడా సంస్కృత కోశాదుల పద్ధతిలోనే ఉన్నాయి. పాశ్చాత్యుల రాకతో, వారి సంపర్కం వల్ల అకారాది నిఘంటువులు వెలిశాయి. అకారాది క్రమంలో ద్విభాషాకోశాలు, ఏక భాషాకోశాలు పారిభాషిక నిఘంటువులు, పదపట్టికలు, వైద్య నిఘంటువులు, లఘుకోశాల వంటి విలక్షణమైన గ్రంథాలు ఆవిర్భవించాయి.
5.3.1 మాండలికవృత్తిపదకోశాలు: మాండలికపదాలపై ఎంతో కృషి జరిగినప్పటికీ అది జనబాహుళ్యానికి అందలేదు. ఇంకా తెలుగుభాషలో నిఘంటువుల కెక్కని పదాలు సంఖ్యాధికంగా ఉన్నాయి. కొన్ని సంప్రదాయ వృత్తి పద కోశాల తయారీ విషయంలో అకాడమీలు చేసిన కృషి గణనీయమయినది. తెలుగు మాటాడే ప్రజలతో సంబంధం ఉన్న సంప్రదాయ, సంప్రదాయేతర ఆధునిక వృత్తులపై కూడా పరిశోధన జరగవలసి ఉంది. వాటి పదాలు కోశస్థం కావలసిన అవసరమూ ఉంది. తెలుగు వారికి ఎన్నో ఆటలు ఉన్నాయి. ఆటలలో ఉన్న ఎన్నో పదాలు నిఘంటువులకు ఎక్కలేదు. ఒక్క గాలిపటాల ఆటలో, తయారీలో వందలాది పదాలు వాడుకలో ఉన్నాయి. వీటిని కోశస్థం చేయకపోతే కొన్నాళ్ళకు నశించిపోయే ప్రమాదమూ ఉంది.
ఆధునిక విద్యలో భాగంగా ఆంగ్లభాషావిధాన్ని అనుసరించి తెలుగులో భాషాశాస్త అధ్యయనం ప్రారంభమయ్యింది. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి వంటివారు తెలుగు భాషాశాస్థ్ర పరిశోధనకు పునాదులు పటిష్టంగా వేశారు. అందులో భాగంగానే మాండలిక భాషా పరిశోధన ప్రారంభమయ్యింది.

5.4 తెలుగుభాషపై ఆంగ్ల భాషా ప్రభావం : ఇక తెలుగు భాష విషయానికి వస్తే... తెలుగు భాషపై సంస్కృత, ప్రాకృత, ఉర్దూ, ఇంగ్లీషు భాషల ప్రభావం ఉంది. నేడు ఆంగ్లభాష ప్రపంచంలోనే అత్యధికుల వాగ్వ్యవహారంలో ఉంది. దానికి  సామాజిక, చారిత్రకాది అనేక కారణాలు ఉన్నప్పటికీ భాషాపరంగా చూసినట్లయితే ఎటువంటి కొత్తబావాలనైనా తనలో ఇముడ్చుకొని వాటికి స్వీయభాషాలక్షణాలను జతకలిపి ప్రయోగార్హంగా మార్చుకోగలగడం ఆంగ్లభాషకు ఉన్న ప్రత్యేకతలలో ఒకటిఅసాధారణ సులభస్వీకార లక్షణం (extraordinary receptive and adaptability), భిన్నజాతీయాత్మకత (heterogeneousness), స్వాతంత్ర్యం (Individuality) మొదలైన లక్షణాలతో ఆంగ్లభాష విశ్వప్రఖ్యాతిని సాధించుకొంది.  వీటిని దృష్టిలో ఉంచుకొనే ప్రఖ్యాత అమెరికా తత్వవేత్త Ralph Waldo Emerson ఆంగ్ల భాష అనే సముద్రం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల కాలువల నుండి నీటిని  స్వీకరించిందన్నారు. ఈ లక్షణాలవల్ల పరిపుష్టమైన ఆంగ్లభాషనుండి  పాలన పరంగా సంపర్కం ఏర్పడిన కారణంగా ఎన్నో పదాలు భారతీయభాషలలోనికి అలాగే తెలుగులోనికి ప్రవేశించాయి. ఉదాపరణకు కోర్టు, కోచ్, రౌడీ, ర్యాలీ, జడ్జీ, ఫీజు, టైం, కారు, లారీ, బస్సు, రోడ్డు, లైటు మొదలైనవి ఆంగ్లపదాలే. ఆయా కాలాల్లో  ఆయా  భాషల నుంచి ఎన్నో పదాలు, సమాసాలు, ప్రత్యయాలు, వాక్యనిర్మాణాలు తెలుగులోకి ప్రవేశించాయి.  

అంతకుముందు మహమ్మదీయుల పరిపాలన కారణంగా  అరబ్బు, పర్షియన్‌ భాషాపదాలు తెలుగులోకి వచ్చాయిమహమ్మదీయులు 13వ శతాబ్దంలో దండయాత్ర జరుపక ముందే మహాకవి తిక్కన సోమయాజి (13వ శతాబ్దం) మహాభారతంలో తరాజు (త్రాసు) అనే పదాన్ని రెండుసార్లు తన భారతరచనలో ప్రయోగించాడు. అంటే మహమ్మదీయుల వచ్చీరాక ముందే తరాజు అనే పదం తెలుగులోకి వచ్చిందని అర్థంచేసుకోవచ్చు.

విజయనగర రాజులకాలంలో మహమ్మదీయ సైనికులు హిందువులతో సఖ్యంగా ఉండటం వల్ల వారు మాట్లాడే పంజాబీ, హర్యానీ, అరబిక్‌, పర్షియన్‌ పదాలు తెలుగువారి పదాలుగా మారిపోయాయి. మహమ్మదీయుల పరిపాలన కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాలకుల కూడా పర్షియన్‌ భాషను నేర్చుకున్నారు. తద్వారా పర్షియన్‌ పదాలు అనేకం తెలుగులోకి వచ్చిచేరాయి. దివాన్‌, కొత్వాలు మొదలైన పర్షియన్‌ పదాలను పరిపాలనా సౌలభ్యం కోసం 1580 సంవత్సరంలో మహమ్మద్‌ కులీకుతుబ్‌షా కాలంలో దిగుమతి అయ్యాయి. మాతృభాష అయిన తెలుగునే కాకుండా సామాన్య ప్రజలు కూడా కుతుబ్‌షా కాలం నుంచి పర్షియన్‌, ఉర్దూ, హిందుస్తానీ  పదాలను విరివిగా నేర్చుకోవాల్సిన అవసరం ఆనాటి పాలకులవల్ల కలిగిందిఉదాజమ, దఫా, కబ్జా, ఖాతా, హోదా, గూండా, అర్జీ, గస్తీ, కుస్తీ, బస్తీ, కూపీ, మాఫీ, హామీ, లాఠీ, బాకీ, పేచీ, రద్దు, బంద్, జప్తు, షురూ మొదలైనవి. దీనిని బట్టీ సామాజిక సాంస్కృతిక, రాజకీయాది ప్రభావాలు తెలుగు భాషపై ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం పదాలే కాక ఆంగ్లంలోని నుడికారాలు కూడా తెలుగులోనికి ప్రవేశించాయి. ఉదా. రెడ్ హాండెడ్ గా పట్టుకొను, రెడ్ అలర్ట్ ప్రకటించు, బ్లాక్ మెయిల్ చేయు, బ్లాక్ లిస్టులో పెట్టు, క్లీన్ చిట్ ఇచ్చు, హాట్ కేక్ లా అమ్ముడుపోవు మొదలైనవి. సంస్కృతి, జీవన విధానమూ ఏ భాషావ్యవహర్తల మధ్యనైనా  ఎంతోకొంత సామ్యం ఉంటంది. కాబట్టి ఆంగ్లభాషాప్రభావంతో తెలుగులోనికి ఇంచుమించు సమానార్థకాలుగా ప్రవేశించిన కొన్ని ప్రయోగాలు కన్పిస్తాయి.  ఉదాహరణలు చూడండి.
He talks in the air.  ‘వాడు గాలిమాటలు చెప్తున్నాడు
Who bells the cat?        ‘పిల్లి మెడలో గంటెవరు కడతారు?’
Bird’s eye view – ‘విహంగ వీక్షణం
Prime minister took a bird’s eye view ‘ప్రధానమంత్రి విహంగ వీక్షణం చేశారు
To have a hand – ‘హస్తం ఉంది (ఆంగ్ల ప్రభావం) ‘
Crocodile tears – ‘మొసలి కన్నీరు
Out of date – ‘కాలం చెల్లిన
Jack pot – ‘నక్కను తొక్కు
ఇటువంటి నుడికారాలకు అనువాదాలను అన్వేషిస్తే తప్పక దొరుకుతాయి.
కొన్ని కొన్ని ఆంగ్లభావాలకు అనుగుణంగా తెలుగులో నూతన పదాలను సృష్టించుకొని తెలుగులో వాడడం కన్పిస్తుంది. ఉదా. నగ్నసత్యం, శ్వేతపత్రం, కంటితుడుపు చర్య, పచ్చజండా ఊపు, కుంటిసాకులు చెప్పు,  బాల్చీతన్నివేయు మొదలైననవి. విరామ చిహ్నాలు కూడా ఆంగ్లం నుండే తెలుగుభాషలో ప్రవేశించాయి.

పత్రికలు భాషా వినిమయానికి ప్రధాన సాధనాలు. ఇందులో నివేదికలు, రాజకీయ, క్రీడా, వ్యాపార వార్తలూ ఇలా ఎన్నో అన్నీ పత్రికల పరిమితులకు లోబడి ఉంటాయి. ఆంగ్ల భాషలోని వార్తలనూ, కథనాలనూ అనువదించి తెలుగులో ప్రచురించటం వల్ల ఆంగ్లభాషా ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. మౌఖిక భాషలో లేని ప్రయోగాలూ వాక్య విన్యాసాలూ పత్రికలలో కన్పిస్తుంటాయి.
ఉదా. అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి.
కర్మణిప్రయోగం తెలుగు భాషకు అసహజం. నన్నయ పూర్వయుగ శాసనాలలోనూ కర్మణి ప్రయోగాలూ యత్తదర్థక ప్రయోగాలు అత్యంత స్వల్పం. నన్నయ భాషలో సంస్కృత ప్రభావం వల్లనే కన్పిస్తున్నాయి. ఆధునిక భాషలో ముఖ్యంగా పత్రికా భాషలో ఆంగ్ల ప్రభావం వల్ల 'బడు' ప్రయోగం కన్పిస్తుంది.
ఉదా. కళాశాల ప్రారంభిస్తున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాం.
 ఇలాంటి వాక్యాలు మౌఖిక భాషలో ఉండవు. ముఖ్యంగా ప్రచారం కోసం చేసే ప్రకటనలలో ఎక్కువగా కన్పిస్తాయి.
శ, ష, లు ఆధునిక తెలుగులో ఆంగ్ల, హిందీ భాషల ప్రభావం వల్ల ఒకదాని స్థానంలో మరొకటి ఉచ్చరింపబడతాయి. అవ్యుత్పన్నత కూడా దీనికి కారణంకావచ్చు.
ఉదా. ఆంధ్ర ప్రదేశ్ -  ఆంధ్ర ప్రదేష్,
  అరుణాచల ప్రదేశ్ - అరుణాచల ప్రదేష్, రమేశ్- రమేష్  
రాతలో '' కారమే ఉంటుంది. ఉచ్చారణ లోనే '' కారం విన్పిస్తుంది. 'దేశం' అని విడిగా రాసినప్పుడూ పలికినప్పుడూ శకారమే ఉంటుందిఇలా ఎన్నో భాషాపరిణామాలు ఆంగ్లభాషాప్రభావం వల్ల తెలుగులో ఏర్పడ్డాయి.

6.0   ప్రస్తుత భాషాసంక్షోభం: కీలకాంశం-ప్రపంచీకరణ:
కోట్లాదిమంది వాడుకరులనూ  కంప్యూటర్లనూ   అనుసంధానిస్తూ అనునిత్యం లక్షలాది పుటల జ్ఞాన సృష్టికి  వేదికగానిలుస్తూ నేటి ఆధునిక మానవ ఆవిష్కరణలో తలమానికమైన  అంతర్జాలం, విశ్వ వ్యాప్త జాలికావలయం అత్యంత వేగంతో భూగోళం మొత్తానికీ విస్తరిస్తోంది. ప్రపంచంలో ఆవిష్కృతమౌతున్న సమస్త జ్ఞానమూ ఇప్పుడు అంతర్జాలానికి అందుబాటులో ఉంటోంది. ప్రపంచంలోని విపణి వీథులు అంతర్జాలానికి అనుసంధానించబడ్డాయి. విశ్వవిద్యాలయాలూ, పరిశోధనశాలలూ, వైద్య ఆరోగ్య సేవాకేంద్రాలూ, బ్యాంకు సేవలూ, అన్ని రకాల రవాణా సౌకర్యాల సేవలకూ   సంబంధించిన విషయాలన్నిటికీ అంతర్జాలమే ఆధారం. ఈ పరిజ్ఞానాన్ని అందుకోవడానికి ప్రాప్తి స్థానం అంతర్జాలంలోని జాలికావలయాలలోని పరిష్కరిణులు, శోధకాలు, వివిధ ప్రాయోగిక ఉపకరణాలు సమస్తం ఇంగ్లీషులోనే కాదు అన్ని భాషలలోనూ లభ్యమౌతున్నాయి. అంతర్జాతీయీకరణ ప్రముఖ ఉద్దేశం ఉపకరణాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే.  ఇదే ఒరవడిలో స్థానికీకరణ, లేక ప్రాంతీకరణ కూడా ఉంది. అంటే అంతర్జాతీయంగా లభ్యమయ్యే ప్రతిదీ స్థానికీకరణం చెంది స్థానిక లేక ప్రాంతీయ భాషలలో లభ్యమౌతాయి.  అంతర్జాలంలో దొరికే ప్రతిదీ స్థానికీకరణం పొందవచ్చు. అసలు ఈనాడు భాష అడ్డుగోడగా మారవలసిన అవసరం లేదు. ఎవరి భాషను వారు వాడుకొనేందుకు అంతర్జాలం వీలుకలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న భాషాతంత్రం (లేంగ్వేజ్ టెక్నాలజీ) భాషలమధ్య యంత్రానువాదాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీనితో ప్రపంచంలోని ఒకభాషలోని విషయాన్ని ఇంకొక భాషలోకి అతి స్వల్పకాలంలో అనువదించుకోవచ్చు. భాషలు ఇక ఏమాత్రం అడ్డుగోడలు కావు. ఎవరిభాషలో వారు వారివారి కార్యకలాపాలు జరుపుకోవచ్చు. ఎవరి మాండలికంలో వారు రాసుకోవచ్చు వేరొక మాండలికానికి మార్చుకోవచ్చు. నేడు తనకు వచ్చిన మాండలికంలో రాయడం నచ్చిన మాండలికంలో చదువుకోవడం సాధ్యం. ఒకరి మాండలికం మరొకరిపై, ఒకరి భాష మరొకరిపై రుద్దవలసిన అవసరం లేదు. ఎవరి ఇష్టమొచ్చిన భాషలో వారు రాసుకోవచ్చు. రాసినదాన్ని మరొక భాషలోకి మార్చుకొనే ప్రక్రియలు ఉపయోగంలోకి వస్తున్నాయి. ఇవాళ అవి గుణాత్మకంగా లేకపోయినా త్వరలో గుణాత్మకమైన భాషాతంత్ర ఉపకరణాలు అందుబాటులోకి వస్తాయి.
ప్రపంచీకరణతో భాషాసంపర్కం అనివార్యం. పరభాషాసంపర్కంవలన భాషల ఉనికికి ముప్పురావలసిన అవసరం లేదు. అయితే భాషాసంపర్కంలో తూకం మారినప్పుడు ఆయా భాషల మనుగడలో మార్పులూ చేర్పులూ జరుగుతుంటాయి. ఈ మార్పులు కీలకమైన సందర్భాలలో భాషాసంపర్కంలోని తూకం కుంటుపడుతుంది. ఇది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది, భాషలో మార్పులు, రెండవది, వాడకంలో మార్పులు. భాషలో మార్పు, పదజాలంలోనూ, భాషానిర్మాణంలోనూ కావచ్చు. అన్యభాషాపదజాలం ఎంత ఎక్కువగా చేరితే భాషకు అంత శబ్దసంపద పెరుగుతుంది. దీనివలన భాషలో సందర్భానుసారంగా సాగే గుణం సర్దుకు పోయే తత్వం పెరుగుతుంది. అయితే నేడు ఆంగ్లభాష వల్ల తెలుగులోని క్రియాప్రయోగాలు, వాక్యప్రయోగాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా తెలుగులో నిత్యవ్యవహారంలోనూ ప్రాథమిక పదజాలం తగ్గిపోతోంది. ప్రాథమిక పదజాలంలో మార్పులు దూరంగా పొంచివున్న ముప్పుకు సంకేతం. ప్రాథమిక పదజాలంలో మార్పులు వచ్చాయంటే భాషలోని మిగిలిన పదజాలాన్ని అన్యభాషాపదజాలం ఆక్రమిస్తోందని చెప్పాలి.  ఇక రెండవ రకానికి చెందిన సమ తూకం లేని భాషాసంపర్కంవలన వాడకంలో వచ్చే మార్పులు భాషల విధ్వంసకారకాలు. ఈ మార్పు సాధారణంగా సంపర్క భాషలలోని ఒక భాష మరొక భాష వాడే రంగాలలో తిష్ఠవేయడంవలన వస్తుంది. అంటే భాషను వాడుతున్న రంగాల కుదింపు మొదలయ్యింది అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాడకం తగ్గుదల కనిపించిన భాషలు ఆపన్న భాషల జాబితాకెక్కినట్లే. ఇట్లా భాషల  వాడుక రంగాలు తరిగిపోవడం దాపున పొంచివున్న ముప్పుకు సంకేతం. రకమయిన నష్టం అంతకు ముందు సంస్కృత, ప్రాకృతాలవలనగానీ  పర్శియను, అరబిక్ లాంటి పరాయి భాషలవల్ల కానీ తెలుగుభాషకి ఎదురుకాలేదు. ప్రాచీనకాలంలో మత-ధార్మిక రంగాలలో సంస్కృత ప్రాకృత భాషలది పైచేయి అయినా ఆ రంగాలు అంత కీలకమైనవి కావు.
సంస్కృతీ సాంప్రదాయాలూ కట్టూబొట్టూ ఆహారపుటలవాట్లూ, విద్యా వ్యాపార రంగాలూ మొదలయినవాటిల్లో వచ్చిన పరిణామాలవల్ల తెలుగుపదజాలం కూడా నిత్యవ్యవహారంలోంచి జారిపోతోంది. సామాన్యజన వ్యవహారం కూడా దీనికి అపవాదం కాదు. శాస్త్రసాంకేతికరంగాలకు సంబంధించిన పదాల విషయంలో మూలభాషాపదాలను వాడడం సహజంగానే జరుగుతుంది. వీటికి కూడా తెలుగు పదాలను తయారుచేసుకోవచ్చు. సామాన్యవ్యవహారంలో అన్యభాషాపదాలను వాడవలసివచ్చినప్పుడు తెలుగులో ఉన్న పదాలనే ఆయా అర్థాలకు సంబంధించిన వాటిని వ్యాప్తి చేయవచ్చు. లేకపోతే కొత్తపదాలను సృష్టించవచ్చు. అయితే తెలుగులో రెండింటికీ విరుద్ధంగా జరిగింది. కొత్తగా పరిచయమయిన వాటికి కొత్తపదాలను సృష్టించకపోగా తెలుగులో ఉన్నపదాలకు బదులుగాకూడా ఆంగ్లపదాలనే వాడుతున్నారు. తెలుగులో మాటాడడాన్ని తక్కువగా భావించడం, పరిభాషను తయారుచేసుకోలేకపోవడం దీనికి కారణాలు.
బంధుత్వాలను తెలిపేందుకు నేడు ఆంగ్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. ఆంటీ,   అనే పదం పిన్ని, చిన్నమ్మ, అత్త, పెద్దమ్మ ఇంకా తనకంటే వయసులో పెద్దైన తన తల్లి వయసుకు అటూ ఇటుగాఉన్న స్త్రీనీ; అంకుల్ అనే పదం బాబాయి, చిన్నాన్న, మామ, పెద్దనాన్న తనకంటే వయసులో పెద్దైన తన తండ్రి వయసుకు అటూ ఇటుగాఉన్న మగవాడినీ; బ్రదర్, సిస్టర్  అనే పదాలు అన్నా తమ్ముళ్లనూ, అక్కా చెల్లెళ్లనూ తోసిరాజంటున్నాయి.  ఇక మమ్మీ డాడి, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫార్ వంటిపదాలు సరేసరి.
నేటితరానికి వారి శరీరభాగాల పేర్లు పూర్తిగా తెలుగులో తెలీనే తెలియవు. అంగిలి, ఉల్లం, ఎమ్ము, కీలు, నరం, నెరిడె, మణికట్టు, మీగాలు, ముంజేయి, మునివేళ్ళూ, మూలగ లాంటి శరీరభాగాల పేర్లు తెలీదు.
ఆహారపుటలవాట్లు కూడ మారడంతో - చపాతీ, రోటీ, లడ్డూ, జిలేబీ, జాంగ్రీ, పూరీ, పుల్కా వంటి హిందూస్థానీ వంటకాలకు సంబంధించిన పదాలు; పిజ్జా, బర్గర్,  సూప్,  బ్రెడ్, బిస్కెట్ లాంటి ఆంగ్లపదాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
నిత్యవ్యవహారంలో ఉపయోగించే కూరలపేర్లు, దినుసులపేర్లు, వస్తువులు, జంతువులు, కట్టడాలు, ఆటలు, కాలం మొదలయిన వాటిని సూచించే పదాలు, సంఖ్యావాచకాలు, వస్త్రవిశేషాలు... ఇలా చెప్పుకుంటూపోతే మానవజీవనంతో సంబంధం ఉన్న ప్రతి  అంశంలోనూ తెలుగు పదాల్ని కుప్పలుకుప్పలుగా  ఆంగ్లపదాలు ఆక్రమించాయి.
తెలుగు భాష లోని పదాల స్థానే ఆంగ్లపదాలు వ్యవహారంలోనికి రావడానికి   ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సమాజంలో అతి వేగంగా  వస్తున్న కొత్తకొత్త భావనలూ దానికి అనుగుణమైన మార్పులూ, అత్యంత ప్రభావశీల పారిశ్రామికీకరణం, అంతర్జాలద్వారా వాడుకలోకి వస్తున్నవాణిజ్యం మొదలైనవి. ఉదా. గ్యాస్ స్టవ్. ఈ పదం ఇదివరకు లేదు. పొయ్యి, కుంపటి వంటివే వాడుకలో ఉన్నాయి.
గ్యాస్ స్టవ్ వాడకం పెరగడంతో పొయ్యి, కుంపటితో పాటుగా పొంత, గొట్టం, నుసి, పిడక, కచ్చిక వంటి పదాలెన్నో వ్యవహారంలోంచి జారిపోతున్నాయి. అలవాట్లు మారినా నష్టం భాషకే. గ్యాస్ స్టవ్ ను గాలికుంపటి అని తెలుగులోకి అది ప్రవేశించినప్పుడే చేసుకొని ఉంటే కనీసం కుంపటి అనే పదమయినా మిగిలి ఉండేది.
ప్రాచీనకాలపు పనిముట్ల వాడకంకూడా నేడు తగ్గింది. అందువల్ల పదాలు కూడా అందరికీ తెలియవు. ఇవేకాకుండా సామాన్యజనుల వ్యవహారంలో ఉన్న వివిధ రంగాలకు చెందిన పదాల స్థానంలోనూ ఆంగ్లపదాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. వైద్యం, ఆరోగ్యం, న్యాయం, పరిపాలన, ఆర్థికం, సామాజికం, వ్యవసాయం, వృత్తులు, వ్యాపారాలు, విద్య, వంటి రంగాలలోనూ అధికంగా ఆంగ్లభాషాపదాల వాడుక కన్పిస్తుంది. పాశ్చాత్యసంస్కృతి ప్రభావం వల్ల పాశ్చాత్యుల అలవాట్లు కూడా ఇక్కడికి దిగుమతి అవుతూనే ఉన్నాయి. దీని వల్ల కూడా ఆంగ్లపదజాలాన్ని తప్పనిసరిగా ఆశ్రయింవలసివస్తోంది.
ఉదాహరణకి షాపింగ్ మాల్ సంస్కృతి. అందులో అమ్మే వస్తువులలో చాలావాటికి తెలుగులో   పేర్లు ఉన్నప్పటికీపదాలు ఉన్నప్పటికీ  ఆంగ్లంలోనే రాస్తున్నారు. వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ ప్రపంచీకరణ, ప్రతిష్ఠాపాదకత కూడా కొంత కారణాలు అవుతున్నాయి.  వాటివల్ల తెలుగుపదాలు మరుగునపడిపోతున్నాయి.
ఇక నుడికారం సంగతి సరే సరి. తామరతంపరగా వ్యాప్తిలోకి వస్తున్న పదాలకు అడ్డుకట్టవేసే విధానం ఎప్పుడూ భాషావ్యవహర్తలలోనే ఉంటుంది. వారు యా వస్తువుల స్వరూపాన్ని బట్టి సహజంగా సులభంగా మూలానికి దగ్గరగా ఉండే పదాలు తయారుచేస్తారు. వాటిని గుర్తించి వ్యవహారంలోకి తెచ్చేప్రయత్నం చేయాలి. ఏదయినా ఒకపదం చక్కగా తెలిగించితే అది తప్పకుండా సర్వజనామోదాన్ని పొందుతుంది. భాషను నష్టపోవడానికి మన పరభాషావ్యామోహం మాత్రం కారణం కాకూడదు.
జనవ్యవహారం చాలా పదునైనది. కొత్త భావనలకు కొత్త పదాలు అవసరమైనపుడు వాటిని ముఖ్యంగా తెలుగులో వాడడానికి అవకాశం ఉన్న సందర్భాలలోకూడా మనపత్రికలు ఆంగ్లపదాలనే వాడుతున్నాయి. ఉదా: స్వైన్ ఫీవర్ సామాన్యజనాన్ని వణికించిన రోగం. దాన్ని పందిజ్వరం అని ఒక్క పత్రిక కూడా రాయలేదంటే తెలుగుభాషని వాడాలనే తపన పత్రికలవారికి ఎంత ఉందనేది తెలుస్తోంది. దీనికే కన్నడంలో  ‘హందిజ్వరఅని ప్రాచుర్యం. మరి పక్కవాళ్లని చూసి మార్చుకుందామని పత్రికలవాళ్లకి ఆసక్తి కలగలేదంటే కొత్తదనాన్ని మనవాళ్లు ఆహ్వానించడంలేదనే అనుకోవాలి.
 ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన పారిభాషికపదాలకు తెలుగులో కూడా ఆంగ్లపదాలనే ఉపయోగిస్తున్నాం. ఇవి ఇప్పటికే అధికప్రాచుర్యాన్ని పొందాయి. నామవాచకాల సంగతి అటుంచి క్రియలను కూడా యథేచ్ఛగా ఆంగ్లక్రియలనే వాడుతున్నాం. వీటి బాహుళ్యాన్ని తగ్గించి, తెలుగు క్రియా వినియోగాన్ని పెంచాలంటే-   ప్రయత్నం నిరంతరం చేయాలి.
అలాగే భాషాశాస్త్ర పరిభాషలోనూ, యంత్రానువాద పరిభాషలోనూ ఆంగ్లపదాలకు సమానార్థకాలను కల్పించవచ్చు, ఉదా. Spell-checker  దిద్దరి’,   icon ‘రూపు’, internet ‘అంతర్జాలం’, (word) generator ‘(పద) జనకం’,  మొదలైనవి.
 అలాగే సరళీకరణ ప్రపంచీకరణ లాంటి పదాలప్రభావం వల్ల గ్లోబలీకరణ, ప్రైవేటీకరణ మొదలయిన పదాలు అర్థబోధకశక్తి ఉన్నందువల్ల వ్యాప్తిలోకి వచ్చాయి. వీటినీ స్వీకరించాలి.

7.0  మాతృభాషామాధ్యమం ఆంగ్లభాషాప్రభావం
  క్రీస్టియన్ మిషనరీలు ఈస్టిండియా కుంఫిణీ ఏలుబడి మొదలుకాకముందునుంచే విద్యారంగంలోకి ప్రవేశించాయి.  ఈ మిషనరీలు  1717 నుండే కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి, తెలుగు తదితర భారతీయ భాషలలోనే లౌకిక విద్యావిషయాలనూ వాటితోపాటు క్రైస్తవ తత్త్వజ్ఞానాన్నీ బోధించడం ప్రారంభించాయి. 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం మొదటిసారి తమ అధీనంలో వున్న ప్రజలకు విద్యను  అందించటం తన బాధ్యతగా స్వీకరించింది. అప్పటికి ధనవంతులు తమ పిల్లలకు గుడుల్లోనో, గ్రామ  చావిళ్లలోనో లేక ఇళ్లల్లోనో చదవనూ రాయనూ నేర్పించేవారు. వీటిలో సాహిత్య, ధార్మిక, తాత్త్విక,  గణితాది విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.  అవి పూర్తిగా సంస్కృతంతోపాటు తెలుగులోనే సాగేవి. అయితే 1813లో కుంఫిణీ ప్రభుత్వం భారతీయులకు విద్యను అందించే  ప్రక్రియలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టారు. ఈ మార్పులు తామస్ మన్రోతో ప్రారంభం అయ్యాయి. మన్రో   1826లో ప్రజావిద్య పేరుతో మౌలికమార్పులు తీసుకువచ్చాడు. వాటిలో ముఖ్యంగా ప్రతి తాలూకాలో ఒక   తహశీల్దారీ పాఠశాల, ప్రతి జిల్లాకి ఒక కలెక్టరేటు పాఠశాలలు పెట్టి నడిపించాడు. తహశీల్దారీ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే చరిత్ర, రాజనీతి, భూగోళం, సాహిత్యం, గణితం   నేర్పించేవారు. ఐతే జిల్లా స్థాయి కలెక్టరేటు పాఠశాలల్లో   తెలుగూ తదితర భారతీయ భాషలు  తప్ప, ఇంగ్లీషు భాష తోపాటు  యూరొపీయ సాహిత్యం, చరిత్ర, రాజనీతి, భూగోళం,  విజ్ఞానం, గణితం లాంటివి అన్ని విషయాలూ ఆంగ్ల మాధ్యమంలోనే సాగేవి. బ్రిటిషువారు కొత్తగా స్థాపించిన ఆంగ్ల మాధ్యమ పాఠశాల వ్యవస్థ భారతీయ వారసత్వం నుండి భారతీయ యువతను విముఖం చేయడమేగాదు,  చాకచక్యంగా వారిలో విజాతీయతను పాదుకొల్పుతోంది అని అనీ బిసెంట్ (1897) భావించింది.
అయితే, సర్ జార్జ్ కేంబెల్  ఆనాటి పల్లెటూరి బడులలోభారతీయ భాషలూ భారతీయ సాంప్రదాయిక విషయాలూ నేర్పుతుండేవారు అని  1872లో  తన నివేదికలో పొందుపరిచాడు.  అంటే ఆనాడు భారతీయ భాషలకు వెంటనే ఎలాంటి ప్రమాదమూలేదని తెలుస్తోంది.
అధికారంతో, అహంభావ పూరితమైన బ్రిటిష్ చరిత్రకారులు భారతదేశం బ్రిటిష్ సృష్టి అని వాదించేవారు - ఒక ఉమ్మడి భాష,  మతం లేకుండా, భారతదేశం అనే భావనలేదు అనీ ఒక దేశం కాదు అనీ వాదించారు. జాన్ స్టువర్ట్ మిల్ ప్రకారం, జాతీయవాదానికి గతకాలపు ఉమ్మడి సంఘటనలు ఉమ్మడి చారిత్రక జ్ఞాపకాలే మూలాలు.  భారతదేశానికి  గతంలో, అతను సూచించినట్లు, భారతదేశంపట్ల భారతదేశంలోని ప్రజలఅందరినుండీ విధేయత గానీ అణకువగానీ ప్రదర్శిండం లేదు. ఇంకా ఆదేశం అటువంటి బంధాలనూ భావజాలాన్ని  గానీ అందించడంలేదు అంటాడు. అయితే భారతీయుల పట్ల భారతదేశంపట్ల గౌరవం, ఆదరణ ఉన్న ఎందరో పాశ్చాత్యులూ భారతీయులూ ఇట్లాంటి సంకుచిత జాతీయవాదానికీ అట్లాంటి ఆలోచనలకూ దీటుగా జవాబు చెప్పారు. ఒకే భాష, ఒకే మతం జాతీయతకు గుర్తింపు అని నమ్మడం సంకుచిత అభిప్రాయమనీ పలు భాషలూ, పలు మతాలూ పలు సంస్కృతుల మేళవింపుతో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశానికి పాశ్చాత్య జాతీయవాదం గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుందని ఎందరో రాజనీతిజ్ఞులు ప్రకటించారు.

8.0 భారతీయ భాషలూ  తరిగిపోతున్న వ్యవహార రంగాలు
భారతదేశంలో ఆర్యభాషల మీద ద్రావిడభాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) ప్రభావం భాషా నిర్మాణంమీదాఅలాగే ద్రావిడ భాషలపై ఆర్యభాషల ప్రభావం పదజాలంమీదా ఎక్కువగానూ  కనిపిస్తుంది.  ఆస్ట్రో-ఏషియాటిక్, సైనో-టిబెటన్ భాషలపై కొంతమేరకు ఆర్య ద్రావిడ భాషల ప్రభావం కనబడుతోంది. వివిధ భారతీయ భాషలూ,  ప్రత్యేకంగా తెలుగుభాషపై మొదట సాంస్కృతికంగా సంస్కృతం, పరిపాలనాపరంగా ప్రాకృతాలూ తమ ముద్రవేశాయి. సంస్కృత ప్రాకృతాల ప్రభావం చరిత్రకందనంతకాలంనుండీ 10వశతాబ్దం వరకూ సాగింది. షుమారు మూడువేల సంవత్సరాలు ఆర్యభాషల ద్రావిడభాషల సంపర్కం నడిచింది. వేలకొద్దీ పదాలు సంస్కృత ప్రాకృతాల నుండీ తెలుగులో ప్రవేశించాయి. ఐతే, సంస్కృత ప్రాకృతాల ప్రభావం కొన్ని ఉన్నత రంగాలకే పరిమితం. ఈ స్థితి తెలుగు భాషకు జవసత్త్వాలను అందించిందేగానీ నష్టం కలిగించలేదు.  ఐతే 6వ శతాబ్దంనుండీ తెలుగు తనదైనశైలిలో స్వంత జవసత్త్వాలను కూడగట్టుకుంటూ 11వశతాబ్దికి స్వచ్ఛందంగా సాహిత్య, సాంస్కృతిక, పాలనారంగాలలో వైవిధ్య భరితమైన ఆరోగ్యవంతమైన ప్రభావశీలమైన భాషగా రూపొందింది. తెలుగులో కావ్యరచన చేయమంటూ ఆంధ్రభాష యసాధ్యంబె నందు నొక్క కృతిని వినిర్మింపుము అని ఆంధ్రభోజుడైన కర్ణాటరాయనికి దివినుండి భువికి అవతరించిన సాక్షాత్తూ ఆంధ్రమహావిష్ణువే సెలవిచ్చిన తెలుగుగా, దేశభాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన చక్రవర్తులకూ, ఆంధ్రత్వం ఆంధ్రభాషా చ ప్రాభాకర పరిశ్రమ తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసఃఫలమ్ అని ప్రకటించిన కవిపండితులకూ ఆలవాలమైన తెలుగుభాష 16వ శతాబ్దంవరకూ తనకు రావలసిన గౌరవమర్యాదలనే పొందింది. ఐతే, ఈ చారిత్రక ప్రభాత సంధ్యలలో, ఔత్తరాహులైన తురుష్క, పర్షియను, అఫ్ఘను, మొగలాయీ సామ్రాజ్య సేనల పదఘట్టనల కింద నలిగి శల్యావశిష్టమైపోయింది.  తెలుగు తన ప్రాభవాన్ని కోల్పోయింది. తెలుగుకు పాలకుల భాషగా గుర్తింపు పోయి పూర్తిగా పాలితుల భాషగా మిగిలిపోయింది. షుమారు నాలుగువందల సంవత్సరాలు ఎవరికీ పట్టని భాషగా బిక్కుబిక్కుమంటూ రెండవభాషగా సర్దుకుపోయింది. ఈ కాలంలో రాజ్యమేలిన ఉర్దూ,  పర్షియన్, ఇంగ్లీషు భాషల తొక్కిడిని తట్టుకొని నిలబడగలగడానికి కారణం అది సామాన్య ప్రజలభాషగా ఉండటమే. అదే దానికి ఆ శక్తిని ఇచ్చింది. పరిపాలనా, రెవెన్యూ రంగాలలోనూ శాస్త్రసాంకేతికపరంగానూ ఉర్దూ, పర్షియను ఆంగ్లభాషల ప్రభావం ఉందిదీనివల్ల వందలాది పరభాషాపదాలు తెలుగులో చేరాయి. ఐతే, ఈ నేపథ్యం వల్ల తెలుగుభాష నిత్యవ్యవహరం నుంచి   వైదొలగలేదు. కానీ, పాలితులు తెలుగు మాట్లాడినంత కాలం పాలకవర్గ భాష పాలితవర్గభాష మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఎప్పుడైతే  పాలితవర్గభాష కొన్ని రంగాలకే పరిమితం ఔతుందో, ఆ కొన్ని రంగాలలో విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలు లేనప్పుడూ ఆ భాషల ఉనికికి మంగళం పాడినట్టే.  ఈ ప్రభావం ఎక్కువయితే పాలితవర్గ భాష నశిస్తుంది. ఇదే ఇప్పుడు తెలుగుపట్ల జరుగుతోంది.

సమకాలీన సమాజంలోని అన్ని పాఠశాలలలోనూ దాదాపుగా ఆంగ్లమాధ్యమంలోనే శాస్త్రసాంకేతిక విషయాలను బోధిస్తున్నారు. బహు భాషా వ్యవహర్తలు గల భారతదేశంలో 200 పైగా భాషలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కువమంది భాష మాట్లాడితే భాషప్రాంతీయ భాష. ఐతే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా హిందీనీ అంతర్జాతీయ కార్యకలాపాలకు ఆంగ్లాన్నీ వినియోగిస్తున్నారు.

శాస్త్రసాంకేతిక వికాసం వలనా సామాజిక అవసరాల నిమిత్తమూ ఒక ప్రాంతీయ భాషతోపాటు ఇతర భాషలూ నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఒకటికంటే ఎక్కువ భాషలు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం భాషా సమస్య ఉంది. 2 వ అధ్యాయంలో చెప్పుకున్నట్లు బోధన మాధ్యమంగా ఆంగ్లం, సంస్కృతం, అరబిక్ లలో ఏది ఉండాలన్న దానిపై వివాదాలు తలెత్తాయి. చివరకు మెకాలే ప్రతిపాదనల ద్వారా ఆంగ్లం అధికార భాషగా బోధన భాషగా స్థిరపడి చివరకు జాతీయ భాషా స్థానాన్ని ఆక్రమించింది.

9.0  విద్యామాధ్యమం: మాతృభాషలూ ఆంగ్లభాష :
20 శతాబ్దిలో ద్విభాషా సూత్రం అమలులో ఉండేది. ఆంగ్లం ప్రథమ భాష. ప్రాంతీయ భాష ద్వితీయ భాష. స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలకూ, నాయకులకూ, ప్రభుత్వానికీ ఆంగ్లం అనుసంధానంగా ఉన్నప్పటికీ భాష తెలిసినది కొద్దిమందికే. స్వాతంత్రోద్యమంలో ఏదో ఒక దేశ భాష మాత్రమే అధికార భాషగా ఉండాలనే అభిప్రాయం బలపడింది. అధిక సంఖ్యాకుల మాతృభాష హిందీ కావడంతో హిందీ వెలుగులోనికి వచ్చింది.  

స్వాతంత్య్రానంతరం హిందీ అధికార భాష అయ్యింది. దేశమంతటా హిందీభాషను అమలు చేయాలనీ పాఠశాలలో తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. హిందీయేతర ప్రాంతాలలో దీనికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమిళనాడులో ఏకంగా హిందీ వ్యతిరేక ఉద్యమాలు చెలరేగాయి. హిందీ భాషా వాదుల బలం ఎక్కువగా ఉన్నప్పటికీ హిందీని ఇతర భాషా రాష్ట్రాలపై రుద్దడానికి కేంద్రప్రభుత్వం ఒప్పుకోలేదు. పరిస్థితిపై సమీక్షించడానికి కొఠారి కమిషన్ వేసింది. వారి సిఫార్సుల మేరకు ఏర్పడిందే త్రిభాషా సూత్రం. దీని ప్రకారం: హిందీయేతర రాష్ట్రాలలో పిల్లలు నేర్చుకోవలసిన భాషలు: 1. మాతృభాష లేదా ప్రాంతీయ భాష; 2. జాతీయ అధికార భాష(Union Official Language) హిందీ; 3. అంతర్జాతీయ భాష ఆంగ్లం. హిందీ మాతృభాషగా గల రాష్ట్రాలలో నేర్చుకోవలసిన భాషలు: 1. మాతృభాష లేదా ప్రాంతీయభాష హిందీ; 2. అంతర్జాతీయ భాషగా-ఆంగ్లం; 3. ఒక భారతీయ భాష దక్షిణ భారత భాషకు ప్రాధాన్యం).

1964లో కొఠారీ కమీషన్ ప్రతి విద్యార్థీ ప్రాంతీయ భాషతోపాటు విధిగా హిందీ, ఆంగ్ల భాషలను అభ్యసించాలని ప్రతిపాదించింది. 1978లో ఎన్సిఇఆర్టీ (NCERT)  రూపొందించిన 10+2+3 విద్యాప్రణాళికలో కూడా త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. 1986 జాతీయ విద్యావిధానం (NPE 1986) కూడా త్రిభాషా సూత్రానికి ఆమోదం తెలిపింది.

స్వాతంత్ర్యం తర్వాత భాషా ప్రాతిపదికన పునర్వవస్థీకరణ చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ లో నైరుతి సరిహద్దులో కన్నడ-తెలుగు, దక్షిణ ప్రాంతంలో తమిళం-తెలుగు వాడకంలో ఉన్నాయి. తెలంగాణా ప్రాంతంలో తెలుగు, మరాఠీ, ఉర్దూభాషలూ వ్యవహారంలో ఉన్నాయి, ఆంగ్లేయుల పాలనలో ఆంగ్లం అధికార భాషగా బోధనభాషగా ఉండటంవల్ల దేశ భాషలకంటే అధికంగా అది ప్రాచుర్యం పొందింది. దేశ భాష అయిన తెలుగు వెనకబడింది. ఉపాధి సముపార్జన ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికే.   తెలుగు మాధ్యమంలో చదివినవారికి ఉద్యోగ భద్రత లేదు. దీనివల్ల బోధనలోగానీ పాలనలోగానీ ఆశించినంతగా తెలుగు వ్యవహారంలో లేదు. దేశంలోని చాలా రాష్ట్రాలలో హిందీని తృతీయభాషగా ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో వారానికి మూడు గంటలు హిందీకి కేటాయించారు. అంటే కొఠారి కమీషను సూచనల ప్రకారం హిందీయేతర రాష్ట్రాల విద్యా విధానం, భాషావిధానం, ఆచరణలలో భాగంగా త్రిభాషా సూత్రం  జాతీయ స్ఫూర్తిని కలిగిస్తుంది. ఇతర ప్రాంతాలతో సంబంధ బాంధవ్యాలు కలిగేలా చేస్తుంది.  అనువాదాలను, మాతృభాషా ప్రాధాన్యాన్నీ ప్రోత్సహిస్తుంది. తద్వారా అంతర్జాతీయ అవగాహన కలుగుతుంది.

దీనితోపాటు ఉన్నత విద్యాస్థాయిలో కూడా విద్యా బోధన ప్రాంతీయ భాషల్లోనే జరగాలని సిఫారసు చేసిన మొట్టమొదటి నిపుణుల కమిటీ డా. రాధాకృష్ణన్ కమిషన్ (క్రీ..1948). దీనికి మద్దతుగా కాశ్మీర్, నాగాలాండ్ లలో ఆంగ్లభాషా మాధ్యమం విఫలమయ్యిందని విద్యావేత్త శ్రీ.ఎం.వి. రాజగోపాల్ గారు పేర్కొన్నారు. ఇవన్నీ మాతృభాషా మాధ్యమం కాకపోవడం వల్ల కలిగే అనర్ధాలు. మనోవైజ్ఞానికంగా చూస్తే -అజ్ఞాత విషయాన్ని అపరిచిత మాధ్యమం ద్వారా సాధించటం అవాంఛనీయం. పాఠశాల పాఠ్య ప్రణాళికలో  ప్రతిపాదించిన వ్యాప్తి - వినియోగం ఇలా ఉండాలి.
ప్రాథమిక  విద్య1 నుండి 5 తరగతులు : రెండు భాషలు.
1 2 వ తరగతి-  ఒక భాష : మాతృభాష / ప్రాంతీయ భాష .
3 5 వ తరగతి –రెండవ భాష:  మాతృభాష / ప్రాంతీయ భాష .
ప్రాథమికోన్నత విద్య- 6 నుండి 8 తరగతులు :
6 -8 వ తరగతి-  మూడు భాషలు :
1. మాతృభాష / ప్రాంతీయ భాష,
2. ఆధునిక భారతీయ భాష,
3. అంతర్జాతీయ భాష-ఆంగ్లం.
సెకండరీ (ఉన్నత పాఠశాలవిద్య :   9  -10  తరగతులు: మూడు భాషలు.
1. మాతృభాష / ప్రాంతీయ భాష,
2. ఆధునిక భారతీయ భాష,
3. అంతర్జాతీయ భాష-ఆంగ్లం.

 ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత విద్యలో తగిన స్థాయిలో హిందీ, మాతృభాషలైన ప్రాంతీయ భాషలతో కలిపి ఒక మిశ్రమ పాఠ్యక్రమంలో భాగంగా,  సెకండరీ (ఉన్నత పాఠశాలవిద్యాస్థాయిలో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకోసం ఒక అదనపు ఐచ్ఛికంగానూ, హైయర్ సెకండరీ (రెండవ ఉన్నత పాఠశాల) దశలోనూ తగిన ఐచ్ఛికాంశంగా  సంస్కృతాన్ని అందించవచ్చు .
ఆదరణ ఉండి, తగిన మౌలిక ఉపకరణాలతో బోధనావకాశం ఉన్న  చైనీసుజాపనీసు, రష్యను, ఫ్రెంచి , జర్మను, అరబ్బీ, పారశీకం,  స్పానిషు మొదలైన భాషలను  సెకండరీ ( ఉన్నత పాఠశాల) విద్యాస్థాయిలో అదనపు ఐచ్ఛికాలుగా అందించవచ్చు.
పాఠశాల విద్యలోని  అన్ని దశలలోనూ మాతృభాష మాధ్యమంగా ఉండాలి. ఒకవేళ భాషావ్యవహర్తలకు మాతృభాష/ప్రాంతీయ భాష ఒకటే అయితే అదే భాష , ప్రాథమికవిద్య పూర్తి అయ్యేవరకూ అన్నిస్థాయిలలోలనూ మాధ్యమంగా ఉంటుంది. మాతృభాషప్రాంతీయ భాష ఒకటి కాని వ్యవహర్తల విషయంలో ప్రాంతీయ భాషను మూడవ తరగతి నుండీ  బోధనా మాధ్యమంగా స్వీకరించవచ్చు.
జాతీయ విద్యా విధాన ప్రణాళిక 1968, విద్యా విధాన ప్రణాళిక 1986,  త్రిభాషాసూత్రం అమలు కోసం విద్యావిధానంపై పునరుద్ఘాటిస్తూ 1992లో భారతశాసనసభ చేసిన కార్యాచరణ ప్రణాళికా ఇవన్నీ అక్షరాలా చిత్తశుద్ధితో అమలులోనికి రావాలికనీసం ప్రాథమిక విద్యాస్థాయిలోనైనా మాధ్యమంగా మాతృభాష ఉండాలి.
10.0 కమ్ముకొస్తున్న ఆంగ్ల మేఘాలూ-ముంచుకొస్తున్న ముప్పు
పాఠశాల ప్రక్రియలో మరిన్ని భాషలు నేర్చుకోవడం విద్యార్థికి  భారం కాకుండా చూడటమే సరైన పద్ధతి. భాషాశాస్త్రవేత్తలు, విద్యావేత్తలు / రాజకీయవేత్తలు తరచుగా విద్యార్థులకు మాతృభాషా మాధ్యమమే తగినదని చెప్తుంటారు. అలాకాదని ఆంగ్లమాధ్యమం ద్వారా చదివితే ఆంగ్లం బాగా వస్తుందని కొందరు చెప్తుంటారు. కానీ అది అసంబద్ధం. విధానం జాతీయస్ఫూర్తికీ మానవతావిలువలకూ విరుద్ధం. అసలు ఎవరికీ మాతృభాషకాని ఆంగ్లమాధ్యమం ఎవరికోసం? ఎందుకోసం? దీనికి కొందరు చెప్పే జవాబు ఉద్యోగభద్రత.   భారతదేశం లోపలా భారతదేశం బయటా ఉద్యోగాలకోసం భారతీయభాషలను వాడే పద్ధతికి తగిన విద్యావిధానం భారతదేశంలో లేదు. దీనికి చైనా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ వంటి ఆంగ్లేతర భాషలు మాట్లాడే దేశాలే తార్కాణాలు. ఉదాహరణకు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో రెండు భాషలలో ఒకటిగా కన్నడ (ప్రాంతీయ భాష) భాషను పరిచయం చేసింది. స్థాయిలో మార్గదర్శకాలుగా మూడు భాషలు ఉన్నాయిఅవి, మాతృభాష / ప్రాంతీయ భాష, ఒక ఆధునిక భారతీయ భాష మరియు విధిగా ఆంగ్లం. మూడు భాషలు బోధించడం  ప్రాథమిక విద్యావిధానంలో సర్వసాధారణం. ప్రాంతీయభాషా మాతృభాషా ఒకటి కాని విద్యార్థులు తమ మాతృభాషను  ఎంచుకుంటే నక తమ రాష్ట్ర అధికార భాషనే ప్రాంతీయభాష లేక ఆధునిక భారతీయ భాషల విభాగంలో ఏదో ఒక దానినే విధిగా స్వీకరించాలనే నియమం రాష్ట్రప్రభుత్వమే  విధించవచ్చు.
రాష్ట్ర పౌరులందరిచేతా  తమ సొంత ఆధికారిక భాషా విధానవ్యాప్తిని అమలు చేయడానికి రాష్ట్రానికి  ఇది ఒక అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల పాలన వ్యవహారాలలో అధికారభాషావిధానాన్ని కచ్చితంగా అమలుచేయడానికి రాష్ట్రానికి ఇదో అవకాశం కల్పిస్తుంది.
కన్నడ మాతృభాషగా కలవారు.  కన్నడం మాతృభాష కాకపోయినా కర్ణాటక రాష్ట్రంలో నివసించేవారందరూ తప్పనిసరిగా త్రిభాషాసూత్రంలో భాగంగా కన్నడభాషను తప్పక చదవాలని కర్ణాటకప్రభుత్వం నియమం పెట్టింది. అందుకు కావలసిన ఉత్తర్వులను జారీచేసింది. అయితే విద్యామాధ్యమంగా ఒక భాషను తప్పనిసరి చేయడం  వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించడం అవుతుందని భారతీయ న్యాయకోవిదుల అభిప్రాయం. తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యావసరాల నిమిత్తం  భవిష్యత్తు ప్రణాళిక కోసం భాషను ఎంచుకునే సౌకర్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అని న్యాయమూర్తుల అభిప్రాయం.
అయితే ఇట్లాంటి  అభిప్రాయంతో మాతృభాషలో విద్యాబోధన అనేది భారతీయులకు అందరానిదే అవుతుంది.  మాతృభాషలో విద్యాబోధన  అనేది ఈ పరిస్థితులలో అమలుచేయగలగడం కష్టమే.  అంటే దీన్ని ప్రభుత్వాలు చట్టం ద్వారా సాధించబూనడం రాజ్యాంగవ్యతిరేక చర్యకిందకు వస్తుంది. మరి  మాతృభాషలో విద్యాబోధనను ఎట్లా అమలు చేయాలి? ఇది పూర్తిగా సమాజంలోని వ్యక్తుల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. అంటే ఐచ్ఛికంగా సాగాలి.   మాతృభాషలో విద్యాబోధన  అనే మంచి పని చేయడానికి  ఈ సమాజం ఎందుకు వెనకాడుతోంది?  దీనికి జవాబు, పైన చెప్పుకున్నట్లు, ప్రధాన కారణం ఉద్యోగ భద్రత.   జీవనానికి హామీ. భారతీయ భాషలలో చదువు ప్రస్తుతానికి ఉద్యోగ భద్రతనూ జీవన హామీని ఇవ్వలేకపోతున్నాయి. మన ప్రభుత్వాలు భారతీయ భాషామాధ్యమాలలో చదువుకున్నవారికి ఉద్యోగాలు ప్రత్యేకించడం లేదు. దీనికి కారణాలు అనేకం. ఒకటి, ఇంగ్లీషు మధ్యమంలో చదువుకున్నవారు ఎక్కువ నైపుణ్యం గలవారనీ, తెలివిగలవారనీ, సంస్కారవంతులనీ, పాండిత్యం ఉన్నవారనీ, ప్రపంచ జ్ఞానం గలవారనీ మన సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. కొంతమంది  పెద్దల ఆలోచన అట్లాగే ఉంది. రెండు, మనవి బహుభాషా సమాజాలు గనుక ఇంగ్లీషు తెలిసినవారు   ఎక్కువమందితో వ్యవహారాలు నడపగలరు. కానీ ఇది నిజం కాదు. మన రాష్ట్రాలలో నూటికి 90 పాళ్లు ఒక భాష మాత్రమే తెలిసినవాళ్లు. అంటే 90 శాతం మందికి తెలిసిన భాషను వదిలి పరాయి భాషలో పాలన సాగించాలనుకోవడం  అవివేకమే అవుతుంది.   మన విశ్వ విద్యాలయాలు పరిశోధనలో వెనకబడి ఉండడానికి కారణం, పరిశోధనా పత్రాల ప్రకటనలో ఇతరదేశాలవారితో తులనంలో తక్కువ ఉండడానికి ప్రధాన కారణం మనకు తెలియని, మనకు రాని భాషలో రాయవలసిరావడమే. మన శాస్త్ర సాంకేతిక రంగాలలో రావలసినన్ని పాఠ్యగ్రంథాలను రాయలేకపోవడానికి కారణం మనకి ఇంగ్లీషు మీద పట్టు లేకపోవడమే.  ఈమధ్యనే ఐఐఎస్ సి, బెంగళురులో మాట్లాడుతూ ఇన్ఫోసిస్ అధ్యక్షుడు శ్రీ నారాయణమూర్తి భారత దేశంలో సైన్సూ ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలోని పరిశోధనలలో గత అర్ధ శతాబ్దంలో గుర్తించదగ్గ పరిశోధన ఒక్ఖటి కూడా లేదని చెప్పడాన్ని గమనించండి. దీనికి ప్రధాన కారణం మన ఇంగ్లీషు చదువులు కావచ్చు. పరాయి భాషలో జరిగే మన చదువులు జ్ఞాన సముపార్జనలోకంటే భట్టీపట్టి తిరిగి పరీక్షలలో రాయడానికి మాత్రమే పనికివస్తున్నాయి. ఈ చదువులు, మన విద్యార్థులకు, అర్థం చేసుకొని జ్ఞాన సృష్టికీ ఆవిష్కరణలకూ దోహదం చేయడంలేదు.   ఇంగ్లీషులో చదువుకుంటే  ఉద్యోగం వస్తుందనీ, విదేశాలు వెళ్లవచ్చుననేది ఇంకొక ప్రతీతి.  విదేశాలకు ఎందరు  వెళుతున్నారు? ఎవరు వెళుతున్నారు. ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లేవారు లక్షమందివరకూ ఉండవచ్చు. అది మన జనాభాలో ఒక శాతంలో వెయ్యోవంతు. వారికోసం దేశం మొత్తం మన భాషకాని భాషలో విద్య నేర్చుకోవలసిన అవసరం ఏమిటిఒకప్పుడు ఉన్నతవిద్యకు మాత్రమే పరిమితమైన ఇంగ్లీషు మాధ్యమం ఇప్పుడు ప్రాథమిక విద్యకుకూడా పాకింది.  అయితే జనాభాలో 10%కూడా వాడని ఇంగ్లీషు  విద్యామాధ్యమంగా  నిర్ణయించడం   మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేస్తున్న తప్పటడుగులు అని చెప్పక తప్పదు. ఇంగ్లీషు మాధ్యమ విద్య వలన మన ప్రాంతీయ ఉద్యోగ వనరులు దెబ్బతింటున్నాయి. మనలో భారతీయ భాషలు చదివేవారూ వాడేవారూ తగ్గిపోవడంవలన ఆయా భాషలలో పుస్తక రచన ప్రకటన, ప్రచురణలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనికు తోడు అంతర్జాతీయ విపణిలో వెల్లువలా అందుబాటులోకి వస్తున్న ఇంగ్లీషు పుస్తకాలూ, పత్రికలపై   మనం ఆధారపడకతప్పదు. దీనివలన మన విదేశీ ద్రవ్యం వృధా అవుతోంది. అంతేకాక మన సొంత వనరులనూ ఉద్యోగావకాశాలనూ బాగా దెబ్బతీస్తోంది. దీనివలన అంతర్జాలంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న మన భారతీయ భాషలు నిరాదరణకు గురవుతున్నాయి. మాతృ భాషల విద్యామాధ్యమంలో చదువుకున్నవారి ఆలోచనా విధానంలోనే స్వతంత్రేచ్ఛ,  స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఉదాత్తమైన ఆలోచనలకు స్థానం ఉంటుంది. దీనికోసం భారతీయ భాషల వాడకానికి సంబంధించిన ప్రతిబంధకాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
1. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి.
2. మొదట మాతృభాషలో చదవడం రాయడం నేర్చుకున్న విద్యార్థికి పాఠశాల విద్యాభ్యాసంలో ఉత్తీర్ణత మెరుగ్గా ఉంటుంది. అలాగే ద్వితీయ భాషాధ్యయనం సులభతరం ఔతుంది.
3. ప్రాథమిక విద్యలో శాస్త్రీయ దృక్పథంతో భాషా బోధన జరగాలి.
4. ప్రాథమిక విద్యా బోధనలో శాస్త్రీయ, ఆధునిక పద్ధతుల ద్వారా భాషను బోధించేలా   చూడాలి.
5. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతవిద్యా స్థాయిలలో భాషా సాంకేతికతలు వినియోగించే వీలు కల్పించాలి. అన్ని విద్యా విభాగాలలో తెలుగును ఒక భాషగా బోధించే విధానం ఉండాలి.
6. వృత్తి/సాంకేతిక/ తంత్ర విద్యా కళాశాలలలోనూ, భాషాధ్యయనం, పరిశోధనలకు అవకాశం కల్పించాలి.
7. నియత, అనియత, వయోజన, పాఠశాలేతర విద్యాబోధనలలోనూ, కళారంగాలలోనూ భాషకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, భాష ఔన్నత్యాన్ని కాపాడేలా చూడాలి. వీటి వల్ల తెలుగును మాధ్యమంలో చదవడం, తెలుగు చదివినవారికి ఉపాధి కలుగుతాయి. దేశప్రగతికి ఇది దోహదం చేస్తుంది.

11.0 ఉపసంహారం: ఇటీవల భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఎవరికి నచ్చిన మాధ్యమంలో వాళ్ళు చదువుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కును ఉట్టంకిస్తూ ఒక తీర్పు చెప్పింది. అది నిజమే. కానీ దానివల్ల ఆదరణకు నోచుకోని భాషలన్నీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల శీఘ్రగతిన విస్తరిస్తున్న ఆంగ్లభాష ఆధిపత్య పదఘట్టనల కింద దేశీయభాషలన్నీ నలిగిపోతాయి. విద్యావిధానంలో మాతృభాషావ్యవహారానికి అవకాశం లేనప్పుడు భాష అంతరించిపోతుంది. దానితోపాటుగా జాతి, సంస్కృతి అస్తిత్వాన్ని కోల్పోతాయి. తద్వారా భావి భారతం దేశీయభాషా సుజల జలాలు లేని ఎడారిగా మారిపోతుంది. దేశీయ భాషా వ్యవహార జాతులన్నీ త్వరితగతిన అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికీ జీవవిధ్వంసమే. పరోక్షంగా జీవవిధ్వంసానికి కారణమయ్యే భాషా విధానాల పట్ల న్యాయస్థానాలూ చట్టసభలూ పునరాలోచన చేయాలి. జీవవిధ్వంసాన్ని అరికట్టేందుకు మాతృభాషామాధ్యమం, వినియోగం తప్పనిసరి చేస్తూ   రాజ్యాంగ సవరణ చేయాలి.

ఉపయుక్త గ్రంథసూచి:
తెలుగు
ఉమామహేశ్వరరావు, గారపాటి, అద్దంకి శ్రీనివాస్. 2015. తెలుగు రాష్ట్రాలలో భాషావిధానం. అముద్రిత గ్రంథం. కాల్ట్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం.
కృష్ణమూర్తి, భద్రిరాజు.  1995. ‘‘తెలుగు భాష: నాడు, నేడు, రేపు తెలుగు సాహిత్య మాస పత్రిక. హైదరాబాదు: తెలుగు అకాడమి. పుటలు 2 – 10.
కృష్ణమూర్తి, భద్రిరాజు.  1999. భాషా సమాజం - సంస్కృతి. హైదరాబాదు: నీల్ కమల్ ప్రచురణలు.
          ఇంగ్లీషు
Cohn,   Bernard S.1996.  Colonialism and Its Forms of Knowledge: The British in India. Princeton: PUP.
Ridout, Ronald and Clifford Witting. 1976. The Facts of English London:  Pan books. Yenadi Raju, P. 2003. Rayalaseema During Colonial Times: A Study in Indian Nationalism.
 New Delhi: Northern Book Centre.
Vittal Rao, Y. 1979. Education and Learning in Andhra under East India Company.
 Secunderabad: N.Vidyaranyasvamy, P.


 గారపాటి ఉమా మహేశ్వర రావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం