Monday, July 11, 2016

తెలుగు రాష్ట్రాలలో భాషా సంక్షోభం



నేపథ్యం: ఒకప్పుడు, మహా సామ్రాజ్యాలకూ, సంస్కృతులకూ మతాలకూ జ్ఞాననిధులకూ ఆలవాలమైన సంస్కృతం,  లాటినూ, గ్రీకూ, ఈజిప్షియనూ, హిబ్రూ మొదలైనవి ఎన్నో ప్రాచీన భాషలుసైతం తమ స్థితీ గతీ కోల్పోయి నిర్వీర్యమైపోయాయి. నిన్నమొన్నటిదాకా ఊరూ పేరూ లేని చిన్నాచితకా భాషలు గడచిన రెండువందల సంవత్సరాలలో ప్రపంచ భాషలుగా చెలరేగిపోయాయి. దీనికి కారణం  ఆయా భాషాసమూహాల ఆధిపత్యపు పోరు. వారు పెంచి పోషించిన సైనిక పటాలాలు, వారు సాగించిన ఉన్మత్త పైశాచిక హత్యాకాండలూ, నరమేధాలూ, అంతులేని ఎల్లలెరుగని జాతుల విధ్వంసమూ,   ఇవన్నీ కూడా కారణాలు. వీటిద్వారా ప్రజలను భయభ్రాంతులను చేసి,    ఆయా ప్రాంత ప్రజలపై   పెత్తనం చేస్తూ  తద్వారా తమ భాషలను ప్రపంచపటంపై పులిమారు. రాయడం రాని తుంటరి పిల్లలు తెల్లకాగితంపై చెరపరాని తిక్కిరిబిక్కిరి చిత్తడి  రంగులు పులిమినట్లు వారి భాషలను మనపై   బలవంతంగా రుద్దివేశారు. దాని పర్యవసానం, ఈ నేలపై వందలాది భాషలకూ ఆయా భాషా సమూహాల సంస్కృతులకూ సంస్కారాలకూ  నూకలు చెల్లుతున్న తరుణం ఆసన్నమయింది. నాటు భాషల ఆనవాళ్లు చెరిగేపోయే కాలం దాపురించింది. భాష విధ్వంసం జాతి విధ్వంసానికి మూలం. మన దేశం వందల ఏళ్ల బానిసత్వంనుండి బైటపడి పూర్తిగా ఒక్క తరమైనా కాలేదు అప్పుడే  మానసిక బానిసత్వంతో భావదాస్యంలోకి కూరుకుపోతున్న సంకటస్థితి.

ప్రాచీన భారతంలో భాషా స్థితి: భారతదేశంలో  భాషా స్థితిగతులగురించి చెప్పుకోవాలంటే రెండువేల ఐదువందల సంవత్సరాల ప్రత్యక్ష చరిత్రా, అంతకుముందు ఇంకొక రెండువేల ఐదువందల సంవత్సరాలపాటు పరోక్ష చరిత్రనూ తిరగవేయటం అవసరం. క్రీస్తుపూర్వం రెండువేల  సంవత్సరాలకిందట జరిగిన ఋగ్వేద రచన ఒక ఎత్తైతే, దీనికి సమాంతరంగానో లేక కొంత ముందుగానో నడచిన సింధులోయ నాగరికత మరో ఎత్తు. ఆ నాగరికతలో  తెలియని లిపిలో నిక్షిప్తమైవున్న ప్రాచీన భారత ఉపఖండపు భాషా సంస్కృతుల అస్తిత్వానికి ఆనవాళ్లుగా నిలుస్తూ దొరికినవి వందలకొలదీ  ముద్రలూ, అచ్చులూ, పలకలూను. సింధులోయ భాష ఇప్పటి ఒకానొక భాషాకుటుంబానికి చెందినది అని ఇదమిత్థంగా తెలియకపోయినా తప్పక ఏదో ఒక భారత ఉపఖండపు భాషే ఐవుంటుందని ఊహించవచ్చు. భారత ఉపఖండంలో అన్నిటికంటే ముందుగా వినబడినభాష - మధ్యభారతంలోని ముండా-సవరజాతి భాషల ప్రాగ్రూపమే ఐవుండాలి. ఇవీ, ఇంకా చెప్పాలంటే, అండమాన్ నికోబరీస్ దీవులలో మిగిలిన ప్రాచీన పాతరాతియుగపు ఆనవాళ్లుగా నిలిచిన గ్రేట్ అండమానీసు, ఓంగన్, నికోబరీస్ మొదలైన భాషలు ఆస్ట్రో-ఏశియాటిక్ భాషా కుటుంబానికి చెందినవిగా గుర్తించినవీ ఒకే  మహాభాషాకుటుంబానికి చెందినవే. ఈ ఆస్ట్రో-ఏశియాటిక్ భాషలే   మొట్టమొదటగా భారతదేశంలో మాట్లాడిన భాషలు కావచ్చు. ఇట్లా అనుకోవడానికి ఆధారాలు ఉన్నాయి.     భారతదేశంలోని వ్యవసాయ సంబంధమైన పదజాలం  ఈ ముండా-సవర   భాషాసమూహాలదే అంటారు. ఐతే ఆ తరువాత వచ్చిన ద్రావిడ భాషీయులూ ఆర్య భాషాసమూహాలూ ఈ పదజాలాన్ని కొంతవరకూ సొంతం చేసుకున్నారు. కొందరి భాషాశాస్త్రజ్ఞుల ప్రకారం భారతదేశంలో  ముప్ఫై శాతం వ్యవసాయ పదజాలం ముండా భాషలనుండీ, మరో ముప్ఫై శాతం ద్రావిడ భాషలనుండీ సంక్రమించినదే అంటారు. షుమారు మూడు నుండి నాలుగువేల సంవత్సరాలకిందట  అప్పటికే ఇక్కడవున్న స్థానిక ముండా-సవర తదితర భాషావ్యవహర్తలు వాయవ్య ప్రాంతంనుండి వచ్చిన ద్రావిడ భాషా సమూహాల ఆధిపత్య ప్రభావంతో తమ భాషల్ని వదిలిపెట్టి ద్రావిడ భాషలను సొంతం చేసుకున్నారు. అంటే, దక్షిణభారత దేశంలో ఉన్న ప్రస్తుత ద్రావిడ భాషీయులలో అధిక శాతం అప్పటికే ఉన్న ప్రాచీన ఆదిమజాతులకు చెందినవారే, ఐతే భాషాపరంగా మాత్రం ద్రావిడులు. అంటే ఇప్పటి ద్రావిడ భాషా సమూహాలు జాతి పరంగా ఎప్పటినుండో భారతదేశంలో ఉంటున్న ప్రాచీన ఆదిమ జాతులూ ఆతర్వాత వచ్చిన ఆర్వాచీన జాతుల సమాహారం అన్నమాట.   అట్లాగే ఆ తరువాత వచ్చిన హింద్వార్య భాషా సమూహాల ప్రభావంతో అప్పటికే ఉత్తరాదిన ఉన్న ద్రావిడ, ముండా తదితర భాషా సమూహాలు ఎన్నో  తమ  భాషలను వదిలిపెట్టి ఆర్య భాషలను సొంతం జేసుకున్నాయి.   అంటే ఎన్నోసార్లు భారత ఉపఖండంలోని జాతులు తమ తమ మాతృభాషలను కొన్ని ఇబ్బందికర పరిస్థితులలో వదులుకొని ఆధిపత్య, పాలక భాషలను ఎంచుకోవాల్సివచ్చింది. అది ప్రజాస్వామ్యం  లేని కాలం. బలవంతులు బలహీనులను ధన, మాన, ప్రాణాదులతోపాటు భాషా సంస్కృతులను కొల్లగొట్టిన వేళ. చరిత్రకు అందని కాలంలోనూ చారిత్రక ప్రభాత సంధ్యలలోనూ జరిగిన ఈ బలవంతపు మార్పులు కోకొల్లలు. ఐతే బలవంతపు కారణాలవలననే కావచ్చు లేక ఇతరులు సృష్టించిన అత్యవసర పరిస్థితులే కావచ్చు మానవ సమూహాలమధ్య మధ్యకాలీన సమాజాలలో కూడా భాషల బలవంతపు మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. ఐతే వీటి ప్రభావం కొంత మేరకే. ఆనాటి జనాభాకు నేలా నీరూ తదితర వనరులకు కొదవ లేకపోవడంతో బలవంతపు మార్పిడులనుండి తప్పించుకునేందుకు వీలుగా తాము ఉంటున్న జనావాసాలను వదిలి సుదూరంగా వలసవెళ్లారు. ఇట్లా పరుల ఆధిపత్యపు నీడ పడనంతదూరంలో తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లనిచోట కొత్తవలసలను ఏర్పరచుకున్న సందర్భాలు చరిత్రలో కోకొల్లలు.

వలస భారతంలో ఇంగ్లీషు: 1835 లో మెకాలే తెచ్చిన కొత్త విద్యా విధానంతో  ఈ దేశ  ఆధికారిక భాషగా ఇంగ్లీష్ పరిచయం అయింది. ఆ విధానం ఆంగ్ల భాషా మాధ్యమం ద్వారా భారతదేశంలో పడమటిదేశాల విద్యా వ్యాప్తికీ ఆపై సంస్కృతి వ్యాప్తికీ దారితీసింది.  పరిపాలనా విభాగాలలో భారతీయులను నియమించాలి   కాబట్టి  దానికోసం ఇంగ్లీషులో విద్య అవసరం అని వారి నమ్మకం.   
ఐతే మెకాలే ఊహించనిది కొంత నేడు నిజం ఔతున్నదేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇంగ్లీషు భాష భారతీయ సామాన్య జనవ్యవహారంలోకి త్వరత్వరగా వచ్చేస్తోంది. కానీ మెకాలే అనుకున్నదల్లా ఇంగ్లీషు భాష ప్రాచ్య విద్యా విధానంద్వారా ప్రాచ్య దేశాల వ్యాపార భాషగానూ సామ్రాజ్యాధిపత్య భాషగానూ విస్తరిల్లాలని మాత్రమే. ప్రజల భాషగా కాదు. మెకాలే దేశభాషల ద్వారా జనాదరణకలిగిన విద్యావిధానంగురించి ప్రస్తావించలేదు. నాడు బ్రిటిషు ప్రభుత్వ పాలకులకూ కోట్లాది జనులకూ మధ్య దుబాసీలుగా పనిచేసే  భారతీయులను  రక్తమూ రంగూ భారతీయమైనా  రుచీ అభిరుచులలోనూ  ఆచారాలూ ఆలోచనలలోనూ నీతికీ బుద్ధికీ ఆంగ్లమానస పుత్రులైన ఒక వర్గాన్ని తయారు చేయాలన్నదే ఆయన కోరిక.  
భారతీయ భాషల హక్కుల హరణం: 1835 నాటినుంచే పడమటి విద్యవిధానంతోపాటు ఇంగ్లీషు వాడకం వేళ్లూనుకొంది. కొత్తగా ప్రారంభించిన కాలేజీలూ విశ్వవిద్యాలయాలతోనూ వాటివల్ల వచ్చిన ఉద్యోగాల లభ్యతవలన ఇంగ్లీషు నేర్చుకోవాలనే తపన పెరిగింది.  ఈ చారిత్రాత్మక మార్పు భారతదేశపు వేల సంవత్సరాల వారసత్వ సంపదగా సంక్రమించిన భాషా సంస్కృతులకు పోయేకాలం దాపురించిపెట్టిన ఘనత మెకాలేకు దక్కుతుంది. ఈ ఆంగ్ల విద్యావిధానం ఒకరకంగా దేశీయ భాషల ప్రయోజకత్వాన్ని ప్రశ్నించేదిగా తయారైంది.  ఆంగ్లం   చదివినవారికే బ్రిటీషు పాలనలో ఉద్యోగాలు. దీనితో  భారతీయ విద్యాబోధన ఒక్కసారిగా ఇంగ్లీషుకు మళ్లడం, ఆంగ్లవిద్యను జీవనానికి ముడిపెట్టడం ఒకేసారి జరిగిపోయింది. ఇది భారతీయ భాషలకు ఊహించరాని దెబ్బ. బ్రిటిషు ఇండియాలో ప్రభుత్వం ఆధికారికంగా ఒకే భాషతో పనిచేసింది. అదే ఇంగ్లీషు. ఆనాడే భారతీయ భాషలకు చెల్లుచీటీ రాయడం జరిగింది. ఐతే ఉద్యోగాలు తక్కువ అవడం, అత్యధిక జనం, తొంభైతొమ్మిది శాతం మంది, స్థానిక సాంప్రదాయిక వనరులైన వ్యవసాయమూ  తదితర వృత్తిపనులపై ఆధారపడడం చేత భారతీయ భాషలకు ఏమంత నష్టం జరగనట్లే అనుకోవాలి.    ఇంగ్లీషు కొన్ని రంగాలకే పరిమితమై ఉండేది. ఉదాహరణకు  ఉన్నత విద్య, ప్రభుత్వ పాలనా న్యాయ రంగాలకే పరిమితం. తెలుగూ తదితర భారతీయ భాషలను ఇతర రంగాలన్నింటా స్వేచ్ఛగా వాడుతుండేవారు.  అయితే ఉన్నత విజ్ఞాన భాషలుగా పాలనాభాషలుగా వాడకానికి వీలులేకుండా చేయడం కాళ్లూ చేతులూ విరిచి రెక్కలు కట్టినట్లు ముందుకు సాగడానికి వీలులేకుండా శాశ్వత వైకల్యాన్ని అంటగట్టింది. ఇది తెలుగూ తదితర భారతీయ భాషలను కోలుకోలేని స్థితికి తీసుకువెళ్లింది.

ఆధునిక యుగంలో ఏర్పడిన సామాజికభాషా సంక్లిష్టతకు వ్యాపారం, ఉద్యోగం, విజ్ఞానం, సంస్కృతి వంటివాటి ప్రభావమే కారణం.  దీనివలన ఆధునిక  సమాజంలో వినిమయ వస్తుసముదాయాన్ని పునర్నిర్వచించవలసిన అవసరం వచ్చింది. నేడు భాషఒక వినిమయ వస్తువు. ఒకప్పటి సాంస్కృతిక ఉపకరణం   అత్యంత వేగంతో నేడు సామాజిక ఉన్నతికి ఉపకరణంగా మారుతోంది.

స్వాతంత్ర్య  భారతంలో ఇంగ్లీష్: నూట పాతిక కోట్ల మంది ప్రజలూ వందలాది భాషలూ ఉన్న భారతదేశంలో ఇంగ్లీషుది సహాయక అధికార  భాషా   స్థాయి. ఐనా, నిజానికి ఇదే భారతదేశపు  అతి ముఖ్యమైన భాష. హిందీ తరువాత అది భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ  కలిగిన భాష. అయినా  అది భారతదేశంలో చాలా మంది చదివి రాయగలిగిన భాష కాదు.  ఇంగ్లీషును  మాట్లాడేవారు   వయోజన భారతీయుల్లో  కంటే యువ భారతీయుల్లో ఎక్కువ.  రెండవ భాషగా ఇంగ్లీషును వాడేవారు   మొత్తం భారత జనాభాలో   తొమ్మిది శాతం మాత్రమే ఉన్నట్లు అంచనా.     ఐతే,  భారత దేశానికి పట్టణం, గ్రామీణం అనే రెండు ముఖాలు ఉన్నాయి. గ్రామీణ భారతదేశం ఇంగ్లీష్ మాట్లాడటం లేదు,   పట్టణ ప్రజలలో   చెప్పుకోదగినంత మంది  ఇంగ్లీష్ వాడుతుండవచ్చు.  భారతదేశంలో   ఇంగ్లీష్ సామాజిక ఉన్నతికి సూచికగా మారింది. ఆంగ్లభాషలో ప్రవేశం  జ్ఞానానికీ,  విద్యకూ,   తెలివికీ సామాజిక స్థాయికీ సూచిక అని కొందరి ఆలోచన.   భారతదేశపు ఉన్నత విద్యా మాధ్యమ భాషగా పిలవని పేరంటానికి  వచ్చిన ఇంగ్లీష్,   ఆధిపత్య ధోరణిలో నెరపుతున్న దాని కర్రపెత్తనం,    భారతీయ భాషలను  అటకెక్కించివేసే దిశలో సాగుతోంది.  

భారతీయ భాషలూ- ఇంగ్లీషూ: స్థితి – పరిస్థితి: నిన్నటివరకూ అన్ని రంగాలలోనూ వాడుతున్న భారతీయ భాషలు  ఇప్పుడు కొన్ని రంగాలకే పరిమితం కావడం ఒక ఊహించరాని పరిణామం. అంటే విద్య, వైద్య, ఉద్యోగ రంగాలనుండి భారతీయ భాషలు మెల్లగా తమ వాడకంనుండి వైదొలగడం  భవిష్యత్తులో వాటి ఉనికికే చేటుతెచ్చింది. ఆధునిక భారతీయ భాషల వాడకం ఇట్లా కొన్ని రంగాలకే పరిమితం కావడం ఇదే మొదటిసారి కాదు. ప్రాచీన భారతంలో ఆధునిక భారతీయ భాషల వాడకం     ఒకటి రెండు అలౌకిక రంగాలలో సంస్కృత ప్రాకృతాలకు తావిచ్చిన సందర్భాలు ఉన్నా అక్కడ వాటి వాడకం కొంతవరకూ పరిమితమే. అది ఆధునిక భారతీయ భాషల ఉనికికి ఎట్లాంటి విఘాతాన్నీ కలిగించలేదు.  అది లౌకిక వ్యవహార రంగం కాకపోవడంచేత ఆధునిక భారతీయ భాషలను మాట్లాడే  ప్రజలపై దాని ప్రభావం అతితక్కువ. అత్యంత  ముఖ్యమైన లౌకిక వ్యవహార రంగాలలో  భారతీయ భాషల స్థానే ఇంగ్లీషు వాడకం విస్తరించడంతో భారతీయ భాషలకు పరిపుష్టిని కలిగించే వాడుకకు బీటలు పడి వాటి వినాశనానికి బాటలు వేసింది.

ప్రస్తుత భాషాసంక్షోభం: కీలకాంశం-ప్రపంచీకరణ: కోట్లాదిమంది వాడుకరులనూ  కంప్యూటర్లనూ   అనుసంధానిస్తూ అనునిత్యం లక్షలాది పుటల జ్ఞాన సృష్టికి  వేదికగానిలుస్తూ నేటి ఆధునిక మానవ ఆవిష్కరణలో తలమానికమైన  అంతర్జాలం, విశ్వ వ్యాప్త జాలికావలయం అత్యంత వేగంతో భూగోళం మొత్తానికీ విస్తరిస్తోంది. ప్రపంచంలో ఆవిష్కృతమౌతున్న సమస్త జ్ఞానమూ ఇప్పుడు అంతర్జాలానికి అందుబాటులో ఉంటోంది. ప్రపంచంలోని సమస్త విపణి వీథులూ అంతర్జాలానికి అనుసంధానించబడుతున్నాయి. విశ్వవిద్యాలయాలూ, పరిశోధనశాలలూ, వైద్య ఆరోగ్య సేవాకేంద్రాలూ, బ్యాంకు సేవలూ, అన్ని రకాల రవాణా సౌకర్యాల సేవలకూ   సంబంధించిన విషయాలన్నిటికీ అంతర్జాలమే ఆధారం. ఈ పరిజ్ఞానాన్ని అందుకోవడానికి ప్రాప్తి స్థానం అంతర్జాలంలోని జాలికావలయాలలోని పరిష్కరిణులు, శోధకాలు, వివిధ ప్రాయోగిక ఉపకరణాలు సమస్తం ఇంగ్లీషులోనే కాదు అన్ని భాషలలోనూ లభ్యమౌతున్నాయి. అంతర్జాతీయీకరణ ప్రముఖ ఉద్దేశం ఉపకరణాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే.  ఇదే ఒరవడిలో స్థానీకరణ, లేక ప్రాంతీకరణ కూడా ఉంది. అంటే అంతర్జాతీయంగా లభ్యమయ్యే ప్రతిదీ స్థానీకరణం చెంది స్థానిక లేక ప్రాంతీయ భాషలలో లభ్యమౌతాయి.  అంతర్జాలంలో దొరికే ప్రతిదీ స్థానీకరణం పొందవచ్చు. అసలు నేడు భాష అడ్డుగోడగా మారవలసిన అవసరం లేదు. ఎవరి భాషను వారు వాడుకొనేందుకు అంతర్జాలం వీలుకలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న భాషాతంత్రం (లేంగ్వేజ్ టెక్నాలజీ) భాషలమధ్య యంత్రానువాదాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీనితో ప్రపంచంలోని ఒకభాషలోని విషయాన్ని ఇంకొక భాషలోకి అతి స్వల్పకాలంలో అనువదించుకోవచ్చు. భాషలు ఇక ఏమాత్రం అడ్డుగోడలు కావు. ఎవరిభాషలో వారు వారివారి కార్యకలాపాలు జరుపుకోవచ్చు. ఎవరి మాండలికంలో వారు రాసుకోవచ్చు వేరొక మాండలికానికి మార్చుకోవచ్చు. నేడు తనకు వచ్చిన మాండలికంలో రాయడం నచ్చిన మాండలికంలో చదువుకోవడం సాధ్యం. ఒకరి మాండలికం మరొకరిపై, ఒకరి భాష మరొకరిపై రుద్దవలసిన అవసరం లేదు. ఎవరి ఇష్టమొచ్చిన భాషలో వారు రాసుకోవచ్చు. రాసినదాన్ని మరొక భాషలోకి మార్చుకొనే ప్రక్రియలు ఉపయోగంలోకి వస్తున్నాయి. ఇవాళ అవి గుణాత్మకంగా లేకపోయినా త్వరలో గుణాత్మకమైన భాషాతంత్ర ఉపకరణాలు అందుబాటులోకి వస్తాయి.

ప్రపంచీకరణతో భాషాసంపర్కం అనివార్యం. పరభాషా సంపర్కంవలన భాషల ఉనికికి ముప్పురావలసిన అవసరం లేదు. అయితే భాషాసంపర్కంలో తూకం మారినప్పుడు ఆయా భాషల మనుగడలో మార్పులూ చేర్పులూ జరుగుతుంటాయి. ఈ మార్పులు కీలకమైన సందర్భాలలో భాషాసంపర్కంలోని తూకం కుంటుపడుతుంది. ఇది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది, భాషలో మార్పులు, రెండవది, వాడకంలో మార్పులు. భాషలో మార్పు, పదజాలంలోనూ, భాషానిర్మాణంలోనూ కావచ్చు. అన్యభాషాపదజాలం ఎంత ఎక్కువగా చేరితే భాషకు అంత శబ్దసంపద పెరుగుతుంది. దీనివలన భాషలో సందర్భానుసారంగా సాగే గుణం సర్దుకు పోయే తత్వం పెరుగుతుంది. అయితే నేడు ఆంగ్లభాష వల్ల తెలుగులోని   ప్రాథమిక పదజాలం తగ్గిపోతోంది. ప్రాథమిక పదజాలంలో మార్పులు దూరంగా పొంచివున్న ముప్పుకు సంకేతం. ప్రాథమిక పదజాలంలో మార్పులు వచ్చాయంటే భాషలోని మిగిలిన పదజాలాన్ని అన్యభాషాపదజాలం ఆక్రమిస్తోందని చెప్పాలి.  ఇక రెండవ రకానికి చెందిన సమతూకం లేని భాషాసంపర్కంవలన వాడకంలో వచ్చే మార్పులు భాషల విధ్వంసకారకాలు. ఈ మార్పు సాధారణంగా సంపర్క భాషలలోని ఒక భాష మరొక భాష వాడే రంగాలలో తిష్ఠవేయడంవలన వస్తుంది. అంటే భాషను వాడుతున్న రంగాల కుదింపు మొదలయ్యింది అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాడకంలో తగ్గుదల కనిపించిన భాషలు ఆపన్న   అంటే చావు దాపురించిన భాషల జాబితాకెక్కినట్లే. ఇట్లా భాషల  వాడుక రంగాలు తరిగిపోవడం దాపున పొంచివున్న ముప్పుకు సంకేతం. రకమయిన నష్టం అంతకు ముందు సంస్కృత, ప్రాకృతాలవలనగానీ  పర్శియను, అరబిక్ లాంటి పరాయి భాషలవల్ల కానీ తెలుగుభాషకి ఎదురుకాలేదు. ప్రాచీనకాలంలో మత-ధార్మిక రంగాలలో సంస్కృత ప్రాకృత భాషలది పైచేయి అయినా ఆ రంగాలు అంత కీలకమైనవి కావు.

భారతీయ భాషలూ  తరిగిపోతున్న వ్యవహార రంగాలు: షుమారు మూడువేల సంవత్సరాలు ఆర్య   ద్రావిడభాషల సంపర్కం నడిచింది.  తెలుగూ తదితర ద్రావిడ భాషల ధాటికి సంస్కృతం రూపురేఖలే మారిపోయి ప్రాకృతాలుగానూ, ఆపై అపభ్రంశాలుగానూ తరువాత ఇప్పటి హిందీ, మరాఠీ, బంగాలీలాంటి ఎన్నో ఉత్తరాది భాషలూ ఏర్పడ్డాయి. అయితే, వేలకొద్దీ పదాలు మాత్రమే సంస్కృత ప్రాకృతాల నుండీ తెలుగులోకి  ప్రవేశించాయి. ఇక, సంస్కృత ప్రాకృతాల ప్రభావం కొన్ని ఉన్నత రంగాలకే పరిమితం. ఈ స్థితి తెలుగు భాషకు జవసత్త్వాలను అందించిందేగానీ నష్టం కలిగించలేదు.   క్రీస్తు శకారంభంనుండీ  తెలుగు తనదైన శైలిలో స్వంత జవసత్త్వాలను కూడగట్టుకుంటూ 11వశతాబ్దికి స్వచ్ఛందంగా సాహిత్య, సాంస్కృతిక, పాలనారంగాలలో వైవిధ్య భరితమైన ఆరోగ్యవంతమైన ప్రభావశీలమైన భాషగా రూపొందింది.  పరిపాలన, జనజీవన రంగాలలోనూ,   కవిగాయకవైతాళికులకూ పండితులకూ ఆలవాలమైన తెలుగుభాష పదహారవ శతాబ్దంవరకూ తనకు రావలసిన గౌరవమర్యాదలనే పొందింది. ఐతే, ఈ చారిత్రక ప్రభాత సంధ్యలలో, ఔత్తరాహులైన తురుష్క, పర్షియను, అఫ్ఘను, మొగలాయీ సామ్రాజ్య సేనల పదఘట్టనల కింద నలిగి శల్యావశిష్టమైపోయింది.  తెలుగు తన ప్రాభవాన్ని కోల్పోయింది. తెలుగుకు పాలకుల భాషగా గుర్తింపు పోయి పూర్తిగా పాలితుల భాషగా మిగిలిపోయింది. షుమారు నాలుగువందల సంవత్సరాలు ఎవరికీ పట్టని భాషగా బిక్కుబిక్కుమంటూ రెండవభాషగా సర్దుకుపోయింది. ఈ కాలంలో రాజ్యమేలిన ఉర్దూ,  పర్షియన్, ఇంగ్లీషు భాషల తొక్కిడిని తట్టుకొని నిలబడగలగడానికి కారణం అది సామాన్య ప్రజలభాషగా మిగిలి ఉండటమే. అదే దానికి ఆ శక్తిని ఇచ్చింది.     తెలుగుభాష నిత్యవ్యవహరం నుంచి   వైదొలగలేదు. పాలితులు తెలుగు మాట్లాడినంత కాలం పాలకవర్గ భాష పాలితవర్గభాష మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఎప్పుడైతే  పాలితవర్గభాష కొన్ని రంగాలకే పరిమితం ఔతుందో, ఆ కొన్ని రంగాలలో విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలు లేనప్పుడూ ఇక ఆ భాషల ఉనికికి మంగళం పాడినట్టే.  ఈ ప్రభావం ఎక్కువయితే పాలితవర్గ భాష నశిస్తుంది. ఇదే ఇప్పుడు తెలుగుపట్ల జరుగుతోంది.
కమ్ముకొస్తున్న ఆంగ్ల మేఘాలూ - ముంచుకొస్తున్న ముప్పు: భాషాశాస్త్రవేత్తలూ, విద్యావేత్తలూ, రాజకీయవేత్తలూ తరచుగా విద్యార్థులకు మాతృభాషా మాధ్యమమే తగినదని చెప్తుంటారు. అలాకాదని ఆంగ్లమాధ్యమం ద్వారా చదివితే ఆంగ్లం బాగా వస్తుందని కొందరు చెప్తుంటారు. కానీ అది అసంబద్ధం. ఇంటా బయటా మాతృభాష వాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న ఇంగ్లీషులో వ్యవహారం  కుంటువడుతుంది. అడుగడుగునా మన ఆలోచనలకు అడ్డుపడుతుంది. ఆత్మన్యూనతాభావాన్ని పెంచుతుంది. విధానం జాతీయస్ఫూర్తికీ మానవతావిలువలకూ విరుద్ధం. నూటపాతిక కోట్లమందికి సమస్థాయిలో మాతృభాషకు దీటుగా ఇంగ్లీషునేర్పగల వనరులు మనకు ఉన్నాయా? గడిచిన నూటయాభై ఏండ్లలో తొమ్మిది శాతానికికూడా ఇంగ్లీషు నేర్పలేని మనం, మిగిలిన తొంభైశాతానికి ఎన్ని వందల ఏండ్లు పడుతుందో. ఈ లోపల జరిగే వేలాది విద్యార్థుల ఆత్మహత్యలూ, లక్షలాది నిరుద్యోగుల హాహాకారాలూ, తల్లిదండ్రుల ఆక్రందనలకూ ఎవరు బాధ్యులు? ఈ జాతి విధ్వంసం దేనికోసం? ఈ జాతి మనుగడనే ప్రశ్నిస్తున్న ఈ భాషా విధ్వంసం ఎవరి పేరున? అసలు ఎవరికీ మాతృభాషకాని ఆంగ్లమాధ్యమం ఎవరికోసం? ఎందుకోసం? దీనికి కొందరు చెప్పే జవాబు ఉద్యోగభద్రత.   భారతదేశం లోపలా భారతదేశం బయటా ఉద్యోగాలకోసం భారతీయభాషలను వాడే పద్ధతికి తగిన విద్యావిధానం భారతదేశంలో లేదు. దీనికి భిన్నంగా చైనా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ వంటి ఆంగ్లేతర భాషలు మాట్లాడే దేశాల భాషావిధానాలను తార్కాణాలుగా చూపవచ్చు.   అయితే విద్యామాధ్యమంగా   మాతృ భాషను తప్పనిసరి చేయడం  వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరించడం అవుతుందని భారతీయ న్యాయకోవిదుల అభిప్రాయం. తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యావసరాల నిమిత్తం  భవిష్యత్తు ప్రణాళిక కోసం భాషను ఎంచుకునే సౌకర్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అని న్యాయమూర్తులు అభిప్రాయ పడడం తప్పుకాదేమోగానీ, ఇంగ్లీషు భాషను తప్పనిసరి చేసే పరిస్థితులను కల్పిస్తున్న విషయాన్నీ పొంచివున్న ముప్పును గురించి క్రియాశీలకంగా ఆలోచిస్తున్న న్యాయకోవిదులు పట్టించుకోరా?
అయితే ఇట్లాంటి  అభిప్రాయంతో మాతృభాషలో విద్యాబోధన అనేది భారతీయులకు అందరానిదే అవుతుంది.  మాతృభాషలో విద్యాబోధన  అనేది ఈ పరిస్థితులలో అమలు చేయగలగడం కష్టమే.  అంటే దీన్ని ప్రభుత్వాలు చట్టం ద్వారా సాధించబూనడం రాజ్యాంగవ్యతిరేక చర్యకిందకు వస్తుంది. మరి  మాతృభాషలో విద్యాబోధనను ఎట్లా అమలు చేయాలి? ఇది పూర్తిగా సమాజంలోని వ్యక్తుల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. అంటే ఐచ్ఛికంగా సాగాలి.   మాతృభాషలో విద్యాబోధన  అనే మంచి పని చేయడానికి  ఈ సమాజం ఎందుకు వెనకాడుతోంది? అంటే జరగబోయే జాతివిధ్వంసాన్ని నిలువరించడానికి రాజ్యాంగంద్వారా సంక్రమించిన వ్యక్తిగత హక్కును సడలించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య కాబోదు గదా.
భాషాసంక్షోభం-ఉద్యోగ భద్రత: నేటి భాషాసంక్షోభానికి పైన చెప్పుకున్నట్లు, ప్రధాన కారణం మన భాషలు ఉద్యోగ భద్రతను  కలిగించలేకపోవడం.   జీవనానికి హామీ ఇవ్వలేకపోవడం. భారతీయ భాషలలో చదువు ప్రస్తుతానికి ఉద్యోగ భద్రతనూ జీవన హామీని ఇవ్వలేకపోతున్నాయి అని అంటారు. మన ప్రభుత్వాలు భారతీయ భాషామాధ్యమాలలో చదువుకున్నవారికి ఉద్యోగాలు ప్రత్యేకించడం లేదు. దీనికి కారణాలు అనేకం. ఒకటి, ఇంగ్లీషు మధ్యమంలో చదువుకున్నవారు ఎక్కువ నైపుణ్యం గలవారనీ, తెలివిగలవారనీ, సంస్కారవంతులనీ, పాండిత్యం ఉన్నవారనీ, ప్రపంచ జ్ఞానం గలవారనీ మన సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. కొంతమంది  పెద్దల ఆలోచన అట్లాగే ఉంది. రెండు, మనవి బహుభాషా సమాజాలు గనుక ఇంగ్లీషు తెలిసినవారు   ఎక్కువమందితో వ్యవహారాలు నడపగలరు. కానీ ఇది నిజం కాదు. మన రాష్ట్రాలలో నూటికి తొంభై పాళ్లు ఒక భాష మాత్రమే తెలిసినవాళ్లు. అంటే తొంభై శాతం మందికి తెలిసిన భాషను వదిలి పరాయి భాషలో పాలన సాగించాలనుకోవడం  అవివేకమే అవుతుంది.  ఇక, మన విశ్వవిద్యాలయాలు పరిశోధనలో వెనకబడి ఉండడానికి కారణం, పరిశోధనా పత్రాల ప్రకటనలో ఇతరదేశాలవారితో తులనంలో తక్కువ ఉండడానికి ప్రధాన కారణం మనకు తెలియని, మనకు రాని భాషలో రాయవలసిరావడమే. మన శాస్త్ర సాంకేతిక రంగాలలో రావలసినన్ని పాఠ్యగ్రంథాలను రాయలేకపోవడానికి కారణం మనకి ఇంగ్లీషు మీద పట్టు లేకపోవడమే. ప్రపంచంలోనే అత్యధికంగా సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మాథమాటిక్సు రంగాలలో గ్రాడ్యుయేట్లను తయారుచేస్తున్నా పరిశోధనలో వెనుకబడివున్నాం. ఈమధ్యనే భారతదేశంలో వైజ్ఞానిక రంగానికి తలమానికమైన బెంగుళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్రాల సంస్థలో మాట్లాడుతూ ఇన్ఫోసిస్ అధ్యక్షుడు శ్రీ నారాయణమూర్తి, భారత దేశంలో సైన్సూ ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలోని పరిశోధనలలో గత అర్ధ శతాబ్దంలో గుర్తించదగ్గ పరిశోధన ఒక్ఖటి కూడా లేదని చెప్పడాన్ని గమనించండి. దీనికి ప్రధాన కారణం మన ఇంగ్లీషు చదువులు కావచ్చు. పరాయి భాషలో జరిగే మన చదువులు జ్ఞాన సముపార్జనలోకంటే భట్టీపట్టి తిరిగి పరీక్షలలో రాయడానికి మాత్రమే పనికివస్తున్నాయి. ఈ చదువులు, మన విద్యార్థులకు, అర్థం చేసుకొని చేసే జ్ఞాన సృష్టికీ ఆవిష్కరణలకూ దోహదం చేయడంలేదు.   ఇంగ్లీషులో చదువుకుంటే  ఉద్యోగం వస్తుందనీ, విదేశాలు వెళ్లవచ్చుననేది ఇంకొక ప్రతీతి.  విదేశాలకు ఎందరు  వెళుతున్నారు? ఎవరు వెళుతున్నారు. ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లేవారు లక్షమందివరకూ ఉండవచ్చు. అది మన జనాభాలో ఒక శాతంలో వందోవంతు కన్నా తక్కువ. వారికోసం దేశం మొత్తం మన భాషకాని భాషలో విద్య నేర్చుకోవలసిన అవసరం ఏమిటిఒకప్పుడు ఉన్నతవిద్యకు మాత్రమే పరిమితమైన ఇంగ్లీషు మాధ్యమం ఇప్పుడు ప్రాథమిక విద్యకుకూడా పాకింది.  అయితే జనాభాలో రెండున్నర లక్షలమందికి మాత్రమే ప్రథమ భాషగా ఉన్న ఇంగ్లీషు  విద్యామాధ్యమంగా  నిర్ణయించడం   మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేస్తున్న తప్పటడుగులు అని చెప్పక తప్పదు. ఇంగ్లీషు మాధ్యమ విద్య వలన మన ప్రాంతీయ ఉద్యోగ వనరులు దెబ్బతింటున్నాయి. మనలో భారతీయ భాషలు చదివేవారూ వాడేవారూ తగ్గిపోవడంవలన ఆయా భాషలలో పుస్తక రచన  ప్రచురణలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ విపణిలో వెల్లువలా అందుబాటులోకి వస్తున్న ఇంగ్లీషు పుస్తకాలూ, పత్రికలపై   మనం ఆధారపడక తప్పడంలేదు. దీనివలన మన విదేశీ ద్రవ్యం వృధా అవుతోంది. అంతేకాక మన సొంత వనరులనూ ఉద్యోగావకాశాలనూ బాగా దెబ్బతీస్తోంది. దీనివలన అంతర్జాలంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న మన భారతీయ భాషలు నిరాదరణకు గురవుతున్నాయి. మాతృ భాషల విద్యామాధ్యమంలో చదువుకున్నవారి ఆలోచనా విధానంలోనే స్వతంత్రేచ్ఛ,  స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఉదాత్తమైన ఆలోచనలకు స్థానం ఉంటుంది. దీనికోసం భారతీయ భాషల వాడకానికి సంబంధించిన ప్రతిబంధకాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
స్థూల జాతీయ ఉత్పత్తి సాధనలో  తెలుగూ తదితర భారతీయ భాషల వాటా సింహభాగం: భారతీయ భాషల మనుగడ కోసం, ప్రత్యేకంగా తెలుగులాంటి భాషపైని మమకారంతోనో తేనెలాంటి తెలుగు అనో, అందమైన అజంత భాష అనో లేక ఆత్మగౌరవం, సంస్కృతీ సాహిత్యం అంటూనో భాషలు బతికి బట్టగట్టే రోజులు కావు ఇవి. భాషల అసలు సిసలు ఆనవాళ్లు కావాలి. వాటి ఉనికిని వెదికి పట్టుకోవాలి. ప్రజా సేవల వినియోగంలో, గనులూ, వస్త్రాలూ, మందుల తయారీ మొదలైన  బడా పారిశ్రామిక రంగాలలో సమాచార వినిమయంలో, వైద్య, వ్యాపార, వాణిజ్య, నిర్మాణ, రవాణా మొదలైన సేవా రంగాలలో, వ్యవసాయం, పాడి, నేత మొదలైన సంప్రదాయ రంగాలలో, సినిమా తదితర మాధ్యమాలలో విరివిగా వాడే భాషలు ఏవి?  ఏయే భాషల వాడకం ఎంతెంతో లెక్కలు తేల వలసివుంది. మన  స్థూల జాతీయ ఉత్పత్తిలో పద్ధెనిమిది శాతంగా ఉన్న వ్యవసాయ సంబంధ రంగాలలో తెలుగూ తదితర భారతీయ భాషలే ప్రధాన భాషలు. సుమారు యాభైఎనిమిది శాతంగా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తికి ఆధారమైన సేవల రంగంలోనూ ప్రధానమైనవి తెలుగూ తదితర  భారతీయ భాషలే. ఇక స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇరవైనాలుగు శాతంగా ఉన్న పారిశ్రామిక రంగాలలో సగానికి పైగా భారతీయ భాషలే వాడుకలో ఉన్నాయి.  అంటే మన స్థూల జాతీయ ఉత్పత్తికి ఆధారమైన మన భాషలను మనం ఎందుకు ఆదరించడం లేదు. వాటిని వాడేందుకు సరైన వాతావరణం కల్పించడం ప్రజా ప్రభుత్వాల బాధ్యత అని గుర్తించాలి గదా. దీనికి ముఖ్య కారణం ఈ రంగాలలో వాడే తెలుగూ తదితర భాషల వాడుకకు అధికారికమైన ఔపచారిక గుర్తింపు లేకపోవడమే. ఉదాహరణకు, వ్యవసాయ రంగంలో పొలాన్ని దున్ని, నాట్లు వేసి, మందులు చల్లి, ఎరువులు వేసి పంటలు పండించి మార్కెట్లకు చేర్చే వరకూ కావలసిన జ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతులలో వారం పదిరోజులపాటైనా రైతులకు తెలుగులో శిక్షణను అందించడానికి మనం చేసిన పని ఏమిటి? ఇలాంటివే వందలాది రంగాలలో ఉన్న సంఘటిత అసంఘటిత శ్రామిక వర్గానికి ఆయా రంగాలలో నైపుణ్యాల పెంపుకు కావలసిన జ్ఞానాన్ని తెలుగులో   అందించటానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావాలి.  అంటే  నైపుణ్యం కొన్ని రంగాలకే పరిమితం కాదు.  నైపుణ్యం అన్ని చోట్లా అవసరం. ఎలాంటి పనికైనా ఒక నిర్దిష్ట పద్ధతిలో నేర్చుకున్న నైపుణ్యం ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది.  

ఉపసంహారం: దూరదృష్టిలేని మన విద్యావిధానాలవలన మన భాషలన్నీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల శీఘ్రగతిన విస్తరిస్తున్న ఆంగ్లభాష ఆధిపత్య పదఘట్టనల కింద దేశీయభాషలన్నీ నలిగిపోతాయి. విద్యావిధానంలో మాతృభాషా వ్యవహారానికి అవకాశం లేనప్పుడు భాష అంతరించిపోతుంది. దానితోపాటుగా జాతి, సంస్కృతి అస్తిత్వాన్ని కోల్పోతాయి. తద్వారా భావి భారతం దేశీయభాషా సుజల జలాలు లేని ఎడారిగా మారిపోతుంది. దేశీయ భాషా వ్యవహార జాతులన్నీ త్వరితగతిన అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికీ జీవవిధ్వంసమే. పరోక్షంగా జీవవిధ్వంసానికి కారణమయ్యే భాషా విధానాల పట్ల న్యాయస్థానాలూ చట్టసభలూ పునరాలోచన చేయాలి. జీవ విధ్వంసాన్ని అరికట్టేందుకు మాతృభాషా మాధ్యమం, వినియోగం తప్పనిసరి చేస్తూ   రాజ్యాంగ సవరణ చేయాలి.

 గారపాటి ఉమా మహేశ్వర రావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

2 comments:

  1. చాలా బావుంది.

    ReplyDelete
  2. మీ భాషా యుద్దం అవర్ననాతీతం ఇది ఒక్క తెలుగు కె పరిమితమ్ కాదు అన్ని మాత్రు భాషలకు వర్తిస్తుందని మీరు విడిచిన ఈ మిసైల్ అన్ని ప్రభుత్వాలు గమనించాలి మరియు తమదైన షైలి లొ మాత్రు భాష ల కి పూర్తి హామీని మరియు పునరాక్రుతి ని కల్పించాలి.

    ReplyDelete