Monday, July 11, 2016

   భాషాసంక్షోభం - ప్రపంచీకరణ
నేపథ్యం: భాషలకు జవసత్వాలూ కాలానుగుణమైన మనుగడనూ చేకూర్చేది వాటి వాడుకే.  అంతేకాదు,        వాడవలసిన అన్ని రంగాలలోనూ వాడటమే భాషల జవజీవాలకు నిదర్శనం. కానీ, చాలా భారతీయ భాషలు  ఇప్పుడు కొన్ని రంగాలకే పరిమితం కావడం ఒక ఊహించరాని పరిణామం. అంటే విద్య, వైద్య, ఉద్యోగ, పరిశోధనా రంగాలనుండి భారతీయ భాషలు మెల్లగా తమ వాడకంనుండి వైదొలగడం  భవిష్యత్తులో వాటి ఉనికికే చేటుతెచ్చింది. ఐతే, భారతీయ భాషల వాడకం ఇట్లా కొన్ని రంగాలకే పరిమితం కావడం ఇదే మొదటిసారి కాదు. ప్రాచీన భారతంలో ఆధునిక భారతీయ భాషల వాడకం     ఒకటి రెండు అలౌకిక రంగాలలోనూ ఒకటీ అరా లౌకిక రంగాలలోనూ సంస్కృత ప్రాకృతాలకు తావిచ్చిన సందర్భాలు ఉన్నా అక్కడ వాటి వాడకం కొంతవరకూ పరిమితమే. అది ఆధునిక భారతీయ భాషల ఉనికికి ఎట్లాంటి విఘాతాన్నీ కలిగించలేదు.  అది లౌకిక వ్యవహార రంగం కాకపోవడంచేత ఆధునిక భారతీయ భాషలను మాట్లాడే  ప్రజలపై దాని ప్రభావం అతితక్కువ. అత్యంత  ముఖ్యమైన లౌకిక వ్యవహార రంగాలలో  భారతీయ భాషల స్థానే ఇంగ్లీషు వాడకం విస్తరించడంతో భారతీయ భాషలకు పరిపుష్టిని కలిగించే వాడుకకు బీటలు పడి వాటి వినాశనానికి బాటలు వేస్తోంది.

ప్రస్తుత భాషాసంక్షోభం-ప్రపంచీకరణ: కోట్లాదిమంది వాడుకరులనూ  కంప్యూటర్లనూ   అనుసంధానిస్తూ అనునిత్యం లక్షలాది పుటల జ్ఞాన సృష్టికి  వేదికగానిలుస్తూ నేటి ఆధునిక మానవ ఆవిష్కరణలో తలమానికమైన  అంతర్జాలం, విశ్వ వ్యాప్త జాలికావలయం అత్యంత వేగంతో భూగోళం మొత్తానికీ విస్తరిస్తోంది. ప్రపంచంలో ఆవిష్కృతమౌతున్న సమస్త జ్ఞానమూ ఇప్పుడు అంతర్జాలానికి అందుబాటులో ఉంటోంది. ప్రపంచంలోని సమస్త విపణి వీథులూ అంతర్జాలానికి అనుసంధానించబడుతున్నాయి. విశ్వవిద్యాలయాలూ, పరిశోధనశాలలూ, వైద్య ఆరోగ్య సేవాకేంద్రాలూ, ప్రభుత్వపాలనా వ్యవహారాలూ, బ్యాంకు సేవలూ, పరీక్షలూ అన్ని రకాల రవాణా సౌకర్యాల సేవలకూ   సంబంధించిన విషయాలన్నిటికీ అంతర్జాలమే ఆధారం. ఈ పరిజ్ఞానాన్ని అందుకోవడానికి ప్రాప్తి స్థానం అంతర్జాలంలోని జాలికావలయాలలోని పరిష్కరిణులు, శోధకాలు, వివిధ ప్రాయోగిక ఉపకరణాలు సమస్తం ఇంగ్లీషులోనే కాదు కొద్దోగొప్పో అన్ని భాషలలోనూ లభ్యమౌతున్నాయి. ప్రపంచీకరణ ప్రముఖ ఉద్దేశం సమాచార  సాంకేతిక ఉపకరణాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే. అయినా, అది ఊహించని విధంగా ప్రపంచ మార్కెట్లను ఆక్రమించి అభివృద్ధిచెందుతున్న బడుగు దేశాలను ఆర్థిక, సాంస్కృతిక పరంగా అన్ని విధాలా కొల్లగొట్టి ఆర్థిక అసమానతలను పెంచుతోంది. ఐతే, దీనికి విరుగుడుగా స్థానికీకరణ లేక ప్రాంతీకరణ కూడా ఉంది. అంటే అంతర్జాతీయంగా లభ్యమయ్యే ప్రతి సమాచార  సాంకేతిక ఉపకరణమూ స్థానికీకరణం చెంది స్థానిక లేక ప్రాంతీయ భాషలలో లభ్యమౌతాయి.  అంతర్జాలంలో దొరికే ప్రతిదీ స్థానికీకరణం పొందవచ్చు. అసలు నేడు భాష అడ్డుగోడగా మారవలసిన అవసరం లేదు. ఎవరి భాషను వారు వాడుకొనేందుకు అంతర్జాలం వీలుకలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే అభివృద్దిచెందుతున్న సాంకేతిక భాషాశాస్త్రం (లేంగ్వేజ్ టెక్నాలజీ) భాషలమధ్య యంత్రానువాదాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీనితో ప్రపంచంలోని ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోకి అతి స్వల్పకాలంలో అనువదించుకోవచ్చు. భాషలు ఇక ఏమాత్రం అడ్డుగోడలు కావు. ఎవరి భాషలో వారు వారివారి కార్యకలాపాలను జరుపుకోవచ్చు. ఎవరి మాండలికంలో వారు రాసుకోవచ్చు వేరొక మాండలికానికి మార్చుకోవచ్చు. నేడు తనకు వచ్చిన మాండలికంలో రాయడం నచ్చిన మాండలికంలో చదువుకోవడం సాధ్యం. కాళోజీ కన్నకల సాకారమయ్యేరోజులు ఇవి. ఒకరి మాండలికం మరొకరిపై, ఒకరి భాషను మరొకరిపై రుద్దవలసిన అవసరం లేదు. ఏదైనా ఒక భాషను గానీ మాండలికాన్ని గానీ ప్రామాణికమని గుర్తించవలసిన అవసరం లేదు. ఎవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకోవచ్చు. రాసినదాన్ని మరొక భాషలోకి మార్చుకొనే ప్రక్రియలు ఉపయోగంలోకి వస్తున్నాయి. ఇవాళ అవి గుణాత్మకంగా లేకపోయినా త్వరలో గుణాత్మకమైన భాషాతంత్ర ఉపకరణాలు అందుబాటులోకి వస్తాయి.

భాషల వాడుక రంగాల కుదింపు:  ప్రపంచీకరణతో భాషాసంపర్కం అనివార్యం. పరభాషా సంపర్కంవలన భాషల ఉనికికి ముప్పురావలసిన అవసరం లేదు. అయితే భాషాసంపర్కంలో తూకం మారినప్పుడు ఆయా భాషల మనుగడలో మార్పులూ చేర్పులూ జరుగుతుంటాయి. ఈ మార్పులు కీలకమైన సందర్భాలలో భాషాసంపర్కంలోని తూకం కుంటుపడుతుంది. ఇది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది, భాషలో మార్పులు, రెండవది, వాడకంలో మార్పులు. భాషలో మార్పు, పదజాలంలోనూ, భాషానిర్మాణంలోనూ కావచ్చు. అన్యభాషా పదజాలం ఎంత ఎక్కువగా చేరితే భాషకు అంత శబ్దసంపద పెరుగుతుంది. దీనివలన భాషలో సందర్భానుసారంగా సాగే గుణం సర్దుకు పోయే తత్వం పెరుగుతుంది. అయితే నేడు ఆంగ్లభాష వల్ల తెలుగులోని   ప్రాథమిక పదజాలం తగ్గిపోతోంది. ప్రాథమిక పదజాలంలో మార్పులు దూరంగా పొంచివున్న ముప్పుకు సంకేతం. ప్రాథమిక పదజాలంలో మార్పులు వచ్చాయంటే భాషలోని మిగిలిన పదజాలాన్ని అన్యభాషాపదజాలం ఆక్రమిస్తోందని చెప్పాలి.  ఇక రెండవ రకానికి చెందిన సమతూకం లేని భాషాసంపర్కంవలన వాడకంలో వచ్చే మార్పులు భాషల విధ్వంస కారకాలు. ఈ మార్పు సాధారణంగా సంపర్క భాషలలోని ఒక భాష మరొక భాష వాడే రంగాలలో తిష్ఠవేయడంవలన వస్తుంది. అంటే భాషను వాడుతున్న రంగాల కుదింపు మొదలయ్యింది అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాడకంలో తగ్గుదల కనిపించిన భాషలు ఆపన్న   అంటే చావు దాపురించిన భాషల జాబితాకెక్కినట్లే. ఇట్లా భాషల  వాడుక రంగాలు తరిగిపోవడం దాపున పొంచివున్న ముప్పుకు సంకేతం. రకమయిన నష్టం అంతకు ముందు సంస్కృత, ప్రాకృతాలవలనగానీ  పర్శియను, అరబిక్ లాంటి పరాయి భాషలవల్ల కానీ తెలుగుభాషకి ఎదురుకాలేదు. ప్రాచీనకాలంలో మత-ధార్మిక రంగాలలో సంస్కృత ప్రాకృత భాషలది పైచేయి అయినా ఆ రంగాలు భాషల మనుగడకు అంత కీలకమైనవి కావు.

భాషాసంక్షోభం-ఉద్యోగ భద్రత: నేటి భాషాసంక్షోభానికి ప్రధాన కారణం మన భాషలు ఉద్యోగ భద్రతను  కలిగించలేకపోవడమేనని చాలామంది ఊహ. ఉద్యోగ భద్రతే  జీవికకు ప్రధాన ఆధారం.  భారతీయ భాషలలో చదువులు ప్రస్తుతానికి ఉద్యోగ భద్రతనూ జీవన హామీని ఇవ్వలేకపోతున్నాయి అని అంటారు. మన ప్రభుత్వాలు భారతీయ భాషామాధ్యమాలలో చదువుకున్నవారికి ఉద్యోగాలు ప్రత్యేకించడం లేదు. దీనికి కారణాలు అనేకం. ఒకటి, ఇంగ్లీషు మధ్యమంలో చదువుకున్నవారు ఎక్కువ నైపుణ్యం గలవారనీ, తెలివిగలవారనీ, సంస్కారవంతులనీ, పాండిత్యం ఉన్నవారనీ, ప్రపంచ జ్ఞానం గలవారనీ మన సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. కొంతమంది  పెద్దల ఆలోచన అట్లాగే ఉంది. రెండు, మనవి బహుభాషా సమాజాలు గనుక ఇంగ్లీషు తెలిసినవారు   ఎక్కువమందితో వ్యవహారాలు నడపగలరు. కానీ ఇవి ఏవీ నిజం కాదు. మన రాష్ట్రాలలో నూటికి తొంభై పాళ్లు ఒక భాష మాత్రమే తెలిసినవాళ్లు. అంటే తొంభై శాతం మందికి తెలిసిన భాషను వదిలి పరాయి భాషలో పాలన సాగించాలనుకోవడం  ప్రజాస్వామ్యం ఎలా ఔతుంది.  ఇక, మన విశ్వవిద్యాలయాలు పరిశోధనలో వెనకబడి ఉండడానికి కారణం, పరిశోధనా పత్రాల ప్రకటనలో ఇతర దేశాలవారితో తులనంలో తక్కువ ఉండడానికి ప్రధాన కారణం మనకు తెలియని, మనకు రాని భాషలో రాయవలసిరావడమే. మన శాస్త్ర సాంకేతిక రంగాలలో రావలసినన్ని పాఠ్యగ్రంథాలను రాయలేకపోవడానికి కారణం మనకి ఇంగ్లీషు మీద పట్టు లేకపోవడమే. ప్రతి ఏడాదీ మన కాలేజీలూ విశ్వవిద్యాలయాలూ దిగుమతి చేసుకునే ఇంగ్లీషు పుస్తకాల విలువే కొన్నివేల కోట్లరూపాయలు. ప్రపంచంలోనే అత్యధికంగా సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మాథమాటిక్సు రంగాలలో గ్రాడ్యుయేట్లను తయారుచేస్తున్నా పరిశోధనలో వెనుకబడివున్నాం. ఈమధ్యనే భారతదేశంలో వైజ్ఞానిక రంగానికి తలమానికమైన బెంగుళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్రాల సంస్థలో మాట్లాడుతూ ఇన్ఫోసిస్ అధ్యక్షుడు శ్రీ నారాయణమూర్తి, భారతదేశంలో సైన్సూ ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలోని పరిశోధనలలో గత అర్ధ శతాబ్దంలో గుర్తించదగ్గ పరిశోధన ఒక్ఖటి కూడా లేదని చెప్పడాన్ని గమనించండి. దీనికి ప్రధాన కారణం మన ఇంగ్లీషు చదువులు కావచ్చు. పరాయి భాషలో జరిగే మన చదువులు జ్ఞాన సముపార్జనలోకంటే  భట్టీపట్టి తిరిగి పరీక్షలలో రాయడానికి మాత్రమే పనికివస్తున్నాయి. ఈ చదువులు, మన విద్యార్థులకు, అర్థం చేసుకొని చేసే జ్ఞాన సృష్టికీ ఆవిష్కరణలకూ దోహదం చేయడంలేదు.   ఇంగ్లీషులో చదువుకుంటే  ఉద్యోగం వస్తుందనీ, విదేశాలు వెళ్లవచ్చుననేది ఇంకొక ప్రతీతి.  విదేశాలకు ఎందరు  వెళుతున్నారు? ఎవరు వెళుతున్నారు? ప్రతి సంవత్సరం మన దేశంనుండి  విదేశాలకు వెళ్లేవారు లక్షమందివరకూ ఉండవచ్చు. అది మన జనాభాలో ఒక శాతంలో వందోవంతు కన్నా తక్కువ. వారికోసం దేశం మొత్తం మన భాషకాని భాషలో విద్య నేర్చుకోవలసిన అవసరం ఏమిటిఒకప్పుడు ఉన్నతవిద్యకు మాత్రమే పరిమితమైన ఇంగ్లీషు మాధ్యమం ఇప్పుడు ప్రాథమిక విద్యకుకూడా పాకింది.  అయితే జనాభాలో రెండున్నర లక్షలమందికి మాత్రమే ప్రథమ భాషగా ఉన్న ఇంగ్లీషు  విద్యామాధ్యమంగా  నిర్ణయించడం   మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేస్తున్న తప్పటడుగులు అని చెప్పక తప్పదు. ఇంగ్లీషు మాధ్యమ విద్య వలన మన ప్రాంతీయ ఉద్యోగ వనరులు దెబ్బతింటున్నాయి. మనలో భారతీయ భాషలు చదివేవారూ వాడేవారూ తగ్గిపోవడంవలన ఆయా భాషలలో పుస్తక రచన,  ప్రచురణలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ విపణిలో వెల్లువలా అందుబాటులోకి వస్తున్న ఇంగ్లీషు పుస్తకాలూ, పత్రికలపై   మనం ఆధారపడక తప్పడంలేదు. దీనివలన మన విదేశీ ద్రవ్యం వృధా అవుతోంది. అంతేకాక మన సొంత వనరులనూ ఉద్యోగావకాశాలనూ బాగా దెబ్బతీస్తోంది. దీనివలన అంతర్జాలంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న మన భారతీయ భాషలు నిరాదరణకు గురవుతున్నాయి. మాతృ భాషల విద్యామాధ్యమంలో చదువుకున్నవారి ఆలోచనా విధానంలోనే స్వతంత్రేచ్ఛ,  స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఉదాత్తమైన ఆలోచనలకు స్థానం ఉంటుంది. దీనికోసం భారతీయ భాషల వాడకానికి సంబంధించిన ప్రతిబంధకాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
స్థూల జాతీయ ఉత్పత్తి సాధనలో  తెలుగూ తదితర భారతీయ భాషల వాటా సింహభాగం: భారతీయ భాషల మనుగడ కోసం, ప్రత్యేకంగా మాతృభాషపైని మమకారంతోనో తేనెలాంటి తెలుగు అనో, అందమైన అజంత భాష అనో లేక ఆత్మగౌరవం, సంస్కృతీ సాహిత్యం అంటూనో భాషలు బతికి బట్టగట్టే రోజులు కావు ఇవి. భాషల మనుగడల అసలు సిసలు ఆనవాళ్లు కావాలి. వాటి ఉనికిని వెదికి పట్టుకోవాలి. ప్రజా సేవల వినియోగంలో, గనులూ, వస్త్రాలూ, మందుల తయారీ మొదలైన  బడా పారిశ్రామిక రంగాలలో సమాచార వినిమయంలో, వైద్య, వ్యాపార, వాణిజ్య, నిర్మాణ, రవాణా మొదలైన సేవా రంగాలలో, వ్యవసాయం, పాడి, నేత మొదలైన సంప్రదాయ రంగాలలో, సినిమా తదితర మాధ్యమాలలో విరివిగా వాడే భాషలు ఏవి?  ఏయే భాషల వాడకం ఎంతెంతో లెక్కలు తేలవలసివుంది. మన  స్థూల జాతీయ ఉత్పత్తిలో పద్ధెనిమిది శాతంగా ఉన్న వ్యవసాయ సంబంధ రంగాలలో తెలుగూ తదితర భారతీయ భాషలే ప్రధాన భాషలు. సుమారు యాభైఎనిమిది శాతంగా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తికి ఆధారమైన సేవల రంగంలోనూ ప్రధానమైనవి తెలుగూ తదితర  భారతీయ భాషలే. ఇక స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇరవైనాలుగు శాతంగా ఉన్న పారిశ్రామిక రంగాలలో సగానికి పైగా భారతీయ భాషలే వాడుకలో ఉన్నాయి.  అంటే మన స్థూల జాతీయ ఉత్పత్తికి ఆధారమైన మన భాషలను మనం ఎందుకు ఆదరించడం లేదు. వాటిని వాడేందుకు సరైన వాతావరణం కల్పించడం ప్రజా ప్రభుత్వాల బాధ్యత అని గుర్తించాలి గదా. దీనికి ముఖ్య కారణం ఈ రంగాలలో వాడే తెలుగూ తదితర భాషల వాడుకకు అధికారికమైన ఔపచారిక గుర్తింపు లేకపోవడమే. ఉదాహరణకు, వ్యవసాయ రంగంలో పొలాన్ని దున్ని, నాట్లు వేసి, మందులు చల్లి, ఎరువులు వేసి పంటలు పండించి మార్కెట్లకు చేర్చే వరకూ కావలసిన జ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతులలో వారం పదిరోజులపాటైనా రైతులకు తెలుగులో శిక్షణను అందించడానికి మనం చేసిన పని ఏమిటి? ఇలాంటివే వందలాది రంగాలలో ఉన్న సంఘటిత అసంఘటిత శ్రామిక వర్గానికి ఆయా రంగాలలో నైపుణ్యాల పెంపుకు కావలసిన జ్ఞానాన్ని తెలుగులో   అందించటానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావాలి.  అంటే  నైపుణ్యం కొన్ని రంగాలకే పరిమితం కాదు.  నైపుణ్యం అన్ని చోట్లా అవసరం. ఎలాంటి పనికైనా ఒక నిర్దిష్ట పద్ధతిలో నేర్చుకున్న నైపుణ్యం ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది.  

చివరికి, దూరదృష్టిలేని మన విద్యావిధానాలవలన మన భాషలన్నీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల శీఘ్రగతిన విస్తరిస్తున్న ఆంగ్లభాష ఆధిపత్య పదఘట్టనల కింద దేశీయభాషలన్నీ నలిగిపోతాయి. విద్యావిధానంలో మాతృభాషా వ్యవహారానికి అవకాశం లేనప్పుడు భాష అంతరించిపోతుంది. దానితోపాటుగా జాతీ, సంస్కృతీ తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. తద్వారా భావి భారతంలో   సమాజం సంక్షోభంలో పడుతుంది. కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. పెద్దలపట్ల పిల్లలకు ఆసక్తీ వ్యక్తుల మధ్య విలువలూ అంతరిస్తాయి. దేశీయ భాషా వ్యవహార జాతులన్నీ త్వరితగతిన అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికీ జీవవిధ్వంసమే. పరోక్షంగా జీవ విధ్వంసానికి కారణమయ్యే భాషా విధానాల పట్ల న్యాయస్థానాలూ చట్టసభలూ పునరాలోచన చేయాలి.  జీవ విధ్వంసాన్ని అరికట్టేందుకు మాతృభాషా
మాధ్యమం, వినియోగం తప్పనిసరి చేస్తూ   రాజ్యాంగ సవరణ చేయాలి. ఆట్లా కానప్పుడు త్వరలోనే మనం భాషను ఔట్ సోర్సింగ్ చేసుకోబోతున్నామనమాట. అంటే ఆంగ్లం, ఇప్పుడు ఔట్ సోర్సింగ్ భాషగా అవతారమెత్తబోతోంది. మన చేతులకు తడి అంటకుండా, మనకు అనుభవంలోకి రాకుండా పనికానిచ్చుకోవడమే గదా ఔట్ సోర్సింగ్.    దీంతో సమాచార వినిమయంలో మన భాషల ప్రమేయాన్ని తోసిరాజనడమే.
గారపాటి ఉమామహేశ్వరరావు
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

No comments:

Post a Comment